శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi

పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో గృహాల ధరలు తగ్గవు : క్రెడాయి

దేశంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో గృహాల ధరలు ఏమాత్రం కిందికి దిగిరావని ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీల సంఘం క్రెడాయ్ అభిప్రాయపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంత

దేశంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో గృహాల ధరలు ఏమాత్రం కిందికి దిగిరావని ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీల సంఘం క్రెడాయ్ అభిప్రాయపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో దేశీయంగా గృహాల ధరలు దిగివస్తాయని, మధ్య తరగతి ప్రజలు సులువుగా సొంతింటిని సమకూర్చుకుంటారంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ని క్రెడాయ్ ఖండించింది. 
 
ప్రాథమిక మార్కెట్లో ఇప్పటికే ధరలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇంతకుమించి ధరల పతనాన్ని ఊహించలేమని పేర్కొంది. ఇదేసమయంలో లగ్జరీ విభాగంలో ధరలు కొంత తగ్గవచ్చని తెలిపింది. నోట్ల రద్దును స్వాగతిస్తున్నామని, దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు, లంచగొండితనాన్ని రూపుమాపేందుకు, నకిలీ నగదు చెలామణి, ఉగ్రవాదులకు నిధుల లభ్యతను నిలువరించేందుకు కేంద్ర నిర్ణయం ఉపకరిస్తుందని క్రెడాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
నోట్ల రద్దు తరవాత, ప్రైమరీ విభాగంలో రియల్ ఎస్టేట్ సెక్టారు 15 శాతం మేరకు వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది. దేశ జీడీపీలో వ్యవసాయం తర్వాత అత్యధిక భాగస్వామ్యాన్ని కలిగిన విభాగంగా నిర్మాణ రంగం కొనసాగుతుందని తెలిపింది. బ్యాంకుల్లో డిపాజిట్లు పెరగడంతో 1.75 శాతం వరకూ పొదుపు రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని క్రెడాయ్ అంచనా వేసింది.