ముద్రా రుణం మంజూరైంది... బ్యాంకు వివరాలు పంపండి... వాట్సాప్ మెసేజ్ వచ్చిందంటే జాగ్రత్త!!
మీకు ముద్రా రుణం మంజూరైంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు వివరాలు పంపండి అంటూ వాట్సాప్ మెసేజ్ వచ్చిందంటే తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ముద్రా లోన్‌కు సంబంధించిన ఈ తరహా ప్రచారాన్ని కేంద్రం కొట్టిపారేసింది. ఇలాంటి అవాస్తవాలను నమ్మొద్దని సూచించింది. కొందరు ఆకతాయిలు ప్రజలను బురిడి కొట్టించేందుకు తప్పుడు సందేశాలను పంపుతున్నారని హెచ్చరించింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా స్పందించింది.
ముద్రా రుణాల మంజూరుకు సంబంధించి సందేశాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంపడంలేదని కేంద్రం స్పష్టం చేసింది. ముద్రా అనేది ఒక రీఫైనాన్సింగ్ సంస్థ అని.. ఇది నేరుగా వ్యక్తులకు లేదా వ్యాపారులకు రుణాలను మంజూరు చేయదని పేర్కొంది. అదేవిధంగా రుణాల మంజూరుకు ఏజెంట్లు లేదా మధ్యవర్తులు ఉండరని కూడా తెలిపింది.
ముద్రా రుణాల కోసం సమీపంలోని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఎంఎఫ్‌ఐలను సంప్రదించాలని లేదంటే Udyamimitra పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వం లేదా పథకాలకు సంబంధించి ఏవైనా అనుమానాస్పద మెసేజ్‌లు వస్తే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగానికి ఫిర్యాదు చేయాలని కోరింది. ఇటీవలి కాలంలో వాట్సాప్ మెసేజ్‌ల రూపంలో సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోతున్న విషయం తెల్సిందే.
