శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2015 (12:46 IST)

స్మార్ట్ ఫోన్లలోనే కొత్త చిత్రాలను చూపిస్తాం : ముఖేష్ అంబానీ వెల్లడి

ఇంట్లో కూర్చునే రిలీజైన సినిమాను స్మార్ట్ ఫోన్లో అత్యంత స్పష్టమైన దృశ్య, శ్రవణాలతో తిలకించే రోజు త్వరలో రానుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. వందలాది మంది షేర్ హోల్డర్లను ఉద్దేశించి శుక్రవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. చిత్ర నిర్మాతలతో చేసుకున్న ఒప్పందాలలో భాగంగా రిలయన్స్ జియో మొబైల్ మాధ్యమంగా వివిధ భాషల చిత్రాలను విడుదల చేయనుందని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరకు ఈ సేవలు అందుతాయన్నారు. 4జి సేవలు అందుబాటులోకి వస్తే, డిజిటల్ టెక్నాలజీ రంగం విప్లవాత్మక మార్పుతో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని ముఖేష్ అంబానీ అంచనా వేశారు. 4జి ఎల్టీఈ (లాంగ్ టర్మ్ ఎవల్యూషన్) తరంగాలు 'డిజిటల్' కలను సాకారం చేయనున్నాయని అన్నారు. 
 
ముఖ్యంగా 4జి సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాలైనా, టెలివిజన్ చానళ్లయినా హెచ్‌డీ మోడ్‌లో ఏ విధమైన అవాంతరాలు లేకుండా చూపిస్తామన్నారు. తొలిదశలో 8 భాషలకు చెందిన 17 న్యూస్ చానళ్లు, 14 వినోద చానళ్లు ప్రసారమవుతాయని, వీటిని తిలకించేందుకు రిలయన్స్ జియో ప్రత్యేక యాప్‌లను అభివృద్ధి చేసిందన్నారు. 10 లక్షలకు పైగా పాటలు, వేలాది సినిమాలను కస్టమర్ల కోసం స్టోర్ చేసి వుంచుతామన్నారు. 
 
నాలుగో తరం రేడియో తరంగాలను ఎవరూ ఊహించనంత తక్కువ ధరకు అందిస్తామన్నారు. రిలయన్స్ జియో నుంచి విడుదలైన 'జియో మనీ డిజిటల్' యాప్‌ను వినియోగించడం ద్వారా చిన్న చిన్న బార్బర్ షాపుల నుంచి కిరాణా స్టోర్లు, టాక్సీ డ్రైవర్ల వరకూ, తమ కస్టమర్ల నుంచి నగదు రహిత లావాదేవీలు జరుపుకోవచ్చని, చెల్లించాల్సిన మొత్తం, సులువైన విధానంలో డైరెక్ట్‌గా బ్యాంకు ఖాతాలోకి చేరిపోతుందని తెలిపారు. 
 
అలాగే, దేశంలోని అడుగడుగూ డిజిటల్ పరిధిలోకి రావాలని 20 ఏళ్ల నాడు అమెరికన్లు కన్న కల నిజమైందని, అంతకన్నా తక్కువ సమయంలోనే భారతీయులు పూర్తి స్థాయి డిజిటలైజేషన్‌ను చూడనున్నారని ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్త డిజిటలైజేషన్‌కు ఇండియా రెండు దశాబ్దాల సమయం తీసుకోదన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే, వచ్చే మూడు నాలుగేళ్లలోనే దేశమంతటా పూర్తి డిజిటలైజేషన్ సాధ్యమవుతుందని అంచనా వేశారు.