వాహనదారులకు పెట్రో బాంబుతో షాక్ - పెట్రోల - డీజిల్‌పై రూ.5 పెంపు?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో వాహనదారులకు కేంద్రం షాక్ ఇవ్వనుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఆ భారాన్ని దేశీయంగా వాహనదారులపై నింపాలని నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్‌పై రూ.5 చొప్పున, గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ ధరను రూ.50కు పెంచాలని భావిస్తోంది. ఈ పెంపుపై ఈ నెల 15వ తేదీలోపు అధికారిక ప్రకటన వెలువడవచ్చని కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధం, ఆ తర్వార హర్మోజ్ జలసంధి మూసివేత తదితర కారణాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర 105 డాలర్లకు పెరిగింది. భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో ఆర్థికంగా పెనుభారం పడుతోంది. దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రస్తుతం నెలకు రూ.30 వేల కోట్ల మేరకు నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
ఇపుడు చమురు ధరల పెరుగుదల భారాన్ని ప్రజలపై వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే, ఈ ధరా భారాన్ని ఒకేసారి కాకుండా దశలవారీగా అమలు చేయాలని భావిస్తోంది. ఒకేసారి పెద్దమొత్తంలో ధరలు పెంచితే ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందన్న ఆందోళనను ఆర్థిక రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో రూ.4 లేదా రూ.5 పెంచి, ఆ తర్వాత నష్టాలను భర్తీ అయ్యేంత వరకు దశల వారీగా రూ.2 లేదా రూ.4 చొప్పున పెంచుకుంటూ పోవాలన్నది చమురు సంస్థల ఆలోచనగా ఉంది.
అయితే, పెట్రోల్ ధరలను పెంచితే మాత్రం రవాణా చార్జీలు విపరీతంగా పెరిగిపోయి, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడుతుందని, ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థపై భారం మోపుతుందని భావిస్తున్నారు. పెరుగుతున్న చమురు ధలకుతోడు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా గణనీయంగా పడిపోతోంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై రెట్టింపు భారం పడుతోంది.
