ఉద్యోగ నియామకాలు చేపట్టనున్న జేఎల్ఆర్

Gulzar Ghouse| Last Modified శుక్రవారం, 7 మే 2010 (10:46 IST)
టాటా భాగస్వామ్యంతో నడుస్తున్న ల్యాండ్ రోవర్ సంస్థ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడటంతో వెంటనే 275 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు జేఎల్ఆర్ సంస్థ లండన్‌లో ప్రకటించింది.

జేఎల్ఆర్‌కు చెందిన ఉత్పత్తి కేంద్రం సోలీహల్‌లో తాము కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ ఆ ప్రకటనలో వివరించింది. తమ సంస్థకు చెందిన ఉత్పత్తుల అమ్మకాల్లో వరుసగా ఏడవ నెలలోను వృద్ధి చెందడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం తగ్గుముఖం పడుతుండటంతో తమ సంస్థకు చెందిన ఉత్పత్తుల అమ్మకాలు ఊపందుకున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని తమ సంస్థకు చెందిన ఉత్పత్తులను మరింతగా వృద్ధి చేసేందుకు ఉద్యోగుల అవసరం ఉందని ఆ సంస్థ అభిప్రాయపడింది. దీంతో వెంటనే ఈ నియామకాలను ప్రారంభించనున్నట్లు సంస్థ ఆ ప్రకటనలో తెలిపింది.


దీనిపై మరింత చదవండి :