* పిల్లలకు పరీక్షల్లో మార్కులు తక్కువగా రావడానికి గల కారణాన్ని తల్లిదండ్రులు ముందుగానే విశ్లేషించి, చర్యలు తీసుకుంటే వారు చదువుసంధ్యల్లో ముందంజలో ఉంటారు. పిల్లల్లో కొన్ని కారణాల వల్ల చదువుపై ఏకాగ్రత కుదరదు. పుస్తకం చేతిలో పెట్టుకున్నప్పటికీ.. పెద్దగా వినిపించే రేడియోలు, టేప్ రికార్డర్ల పాటలు, టీవీ కార్యక్రమాల మీదే వారి దృష్టి ఉంటుంది. కనుక పిల్లలు చదువుకుంటున్న సమయంలో పెద్దలు వాటి జోలికి వెళ్లకపోవటం మంచిది.* తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకుండా ఎక్కువసేపు ఆటలకు వదిలేస్తే కొన్ని గంటల సమయం ఆటల్లో గడపడం వల్ల పిల్లలు బాగా అలసిపోయి వారి శరీరం విశ్రాంతిని కోరుతుంది. పుస్తకం చేత పట్టుకున్నా అక్షరాలు అల్లుకుపోయినట్లు నిద్ర ముంచు కొచ్చేస్తుంది. కాబట్టి అలా జరుగకుండా పెద్దలు జాగ్రత్త పడాలి.* పిల్లల్ని చదువుకోమని చెప్పి తల్లి ఇరుగుపొరుగు స్త్రీలతో ముచ్చట్లాడుతుంటే వారి కబుర్లు, నవ్వులు పిల్లల చదువుకు అవరోధం కలిగిస్తాయి. అలాగే పిల్లలు చదువుకుంటున్న సమయంలో తల్లితండ్రులు కీచులాడుకుంటూ, మాటలు విసురుకుంటుంటే పిల్లల ఏకాగ్రత చెడిపోతుంది.