చార్లెస్ స్పర్జన్ 19వ శతాబ్దపు ప్రసిద్ది దైవసేవకుడు. లండన్లో ఆయన ఇంట్లో చాలా కోళ్లుండేవి. అవి చాలా గుడ్లు పెట్టేవి. కాని స్పర్జన్ దంపతులు వాటిని ఎవరికీ ఉచితంగా ఇచ్చేవారుకాదు! ఎంత దగ్గరి బంధువులకైనా వాటిని ఉచ్చితంగా ఇచ్చేవారు కాదు. ఆ కారణంగా ఆయనకు పిసినిగొట్టు అన్న పేర వచ్చింది. అలా కోళ్లు, గుడ్లు అమ్మగా వచ్చిన డబ్బుతో వారు ఒక పేద విధవరాలి కుటుంబాన్ని పోషించారు ఆ రహస్యం భార్యాభర్తలిద్దరూ చనిపోయాక అందరికీ తెలిసింది. కుడిచేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదన్న యేసు ప్రభువు ఆజ్ఞను వారు ఆవిధంగా పాటించారు (మత్త 6:3).దేవునికి సహాయం చేయలనుకుంటున్నాం, ఎలా ఇవ్వాలి? చర్చిలకా? అనాథాశ్రమాలకా? సువార్తా సంస్థలకా? అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నే యేసు ప్రభువుకు వేస్తే పేదలకు ఇవ్వమనే చెబుతాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ నిరుపేదల పక్షపాతి. ఆరోజుల్లో గొప్పవాడైన ధనవంతుడొకాయన, తనకు నిత్య జీవాన్ని ప్రసాదించమని ప్రభువుని కోరాడు. 'నీకొకటి తక్కువగా ఉంది, వెళ్లి నీ ఆస్తినంతా బీదలకు పంచు' అని ప్రభువు ఆదేశిస్తే చిన్నబుచ్చుకుని నిష్క్రమించాడు (మార్కు 10:21).