శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జులై 2020 (10:39 IST)

దేశరోనా కరోనా వైరస్ వీరవిహారం : ఒక్క రోజే 28 వేల కేసులు

దేశంలో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. ఫలితంగా గడచిన 24 గంటల్లో అంటే ఒక్క రోజులోనే ఏకంగా 28637 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 551 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 8,49,553కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 22,674కి పెరిగింది. 2,92,258 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,34,621 మంది కోలుకుని, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
కాగా, శనివారం వరకు దేశంలో మొత్తం 1,15,87,153 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. శనివారం ఒక్కరోజులో 2,80,151 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. 
 
తెలంగాణాలో మరో 1500 కేసులు 
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రక్కసి స్వైరవిహారం చేస్తోంది. కొత్తగా 1,178 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 33,402కి చేరింది. గడచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 736 కేసులు గుర్తించారు.
 
రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ జిల్లాలో 101 కేసులు వచ్చాయి. తాజాగా మరో 9 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 348కి పెరిగింది. ఇవాళ 1,714 మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం 12,135 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఏపీలో మరణ మృదంగం 
ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా, కరోనా మరణాల సంఖ్య నానాటికీ అధికమవుతోంది. ఒక్కరోజులో 17 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 309 దాటింది.
 
ఇక, కొత్తగా 1,813 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 311 కేసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 300, కర్నూలు జిల్లాలో 229, శ్రీకాకుళం జిల్లాలో 204 కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో 1,168 మందిని డిశ్చార్జి చేశారు. దాంతో ఇప్పటివరకు కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14,393కి పెరిగింది. ఓవరాల్ గా 27,235 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇంకా 12,533 మంది చికిత్స పొందుతున్నారు.