శనివారం, 14 మార్చి 2026
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026 (16:08 IST)

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : కంగారులకు షాక్ - జింబాబ్వే విజయం

t20 world cup 2026
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో సంచలనాలు నమోదవుతున్నాయి. క్రికెట్ పసికూనలు మెటి జట్లకు ముచ్చెమటలు పోయిస్తున్నాయి. ఇంగ్లండ్ జట్టును ఆప్ఘనిస్థాన్ జట్టు ఓడించినంత పనిచేసింది. తాజాగా ఆస్ట్రేలియా జట్టును జింబాబ్వే చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించడంతో ఆ జట్టు విజయభేరీ మోగించింది. 
 
ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా, కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆ తర్వాత 170 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 19.3 ఓవర్లలో 146 పరుగులకే పరిమితమైంది. 
 
ఆ జట్టులో మాట్ రెన్‌షా (65) హాఫ్ సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయింది. తన జట్టును గెలిపించలేకపోయాడు. రెన్‌షాతోపాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31), ట్రావిస్ హెడ్ (17) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. జింబాబ్వే బౌలర్ ముజర్బానీ (4/17) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితోపాటు బ్రాడ్ ఇవాన్స్ 3.. మసకద్జ, బర్ల్ చెరో వికెట్ తీశారు.
 
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (64), మరుమణి (35) తొలి వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం నిర్మించారు. మరుమణి ఔటైనా.. రైయాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్)తో కలిసి బెన్నెట్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. హాఫ్ సెంచరీ సాధించి చివరి వరకూ క్రీజ్‌లో నిలిచాడు. దీంతో ఆసీస్‌ ఎదుట 170 పరుగులను లక్ష్యంగా ఉంచారు. ఆసీస్‌ బౌలర్లు స్టాయినిస్, గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు. ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ముజర్బానీ నిలిచాడు.