శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 మార్చి 2016 (15:08 IST)

ధోనీ అద్భుత స్టంపింగ్ :: తలపట్టుకుని వెక్కివెక్కి ఏడ్చిన బంగ్లాదేశ్ క్రికెటర్లు.. ఫ్యాన్స్

గెలుస్తుందన్న మ్యాచ్ ఓడిపోతే.. సగటు అభిమానే కాదు.. జట్టులోని ఆటగాడు కూడా జీర్ణించుకోలేడు. కానీ, బుధవారం రాత్రి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పరిస్థితి అదే జరిగింది. 19.3 ఓవర్ల వరకు బంగ్లాదేశ్ గెలవడం ఖాయమని భావించిన ప్రతి ఒక్కరికీ... చివరి మూడు బంతుల్లో అంతా తారుమారై విజయం దూరమైతే.. వారి పసిత్థి ఏ విధంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ, ఇది కలలో కూడా ఊహించని నిజం. చివరి ఓవర్ వేసిన పాండ్యా... తొలి మూడు బంతులకు పరుగులు సమర్పించుకున్నాడు. 
 
నాలుగు, ఐదు బంతులకు వరుస వికెట్లు పడగొట్టాడు. ఇక ఒక బంతికి.. రెండు పరుగుల చేయాల్సిన తరుణంలో... బ్యాట్స్‌మెన్‌కు అందకుండా వికెట్లకు దూరంగా నేరుగా కీపర్ చేతిలోకి వెళ్లేలా బంతిని విసిరాడు. ఆ బంతిని ఒడిసి పట్టుకున్న ధోనీ.. సూపర్ జెట్ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి రనౌట్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. అంతే.. ఒక్కసారిగా స్టేడియంలోని బంగ్లాదేశ్ అభిమానులతో పాటు.. క్రికెటర్లు కూడా నిశ్చేష్టులై వెక్కివెక్కి ఏడుస్తూ మైదానాన్ని వీడారు.
 
అంతకుముందు.. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనీ అద్భుతమైన స్టంపింగ్‌తో అత్యంత కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు. గేర్ మార్చి బ్యాటింగ్ చేస్తున్న తమీమ్ ఇక్బాల్, సబ్బీర్ రెహ్మాన్‌లను వికెట్ల వెనుక దొరకబుచ్చుకున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో తమీమ్‌ను, జడేజా బౌలింగ్‌లో సబ్బీర్‌ను ఔట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ భారత్ వైపుకు తిరిగింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బ్యాట్స్‌మెన్లు కూడా బ్యాట్ ఝుళిపించడంతో బంగ్లాదేశ్ గెలుపొందడం తథ్యమని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, చివరి మూడు బంతుల్లో పాండ్యా రెండు వికెట్లు తీయగా, ధోనీ ఒక రనౌట్ చేశాడు. దీంతో భారత్ థ్రిల్లింగ్ విజయాన్న నమోదు చేసుకుంది.