బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు షాకిచ్చిన ఐసీసీ... ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో స్కాట్లాండ్?
ఐసీసీతో పాటు బీసీసీఐని బెదిరించాలని ప్రయత్నించి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఐసీసీ తేరుకోలేని షాకిచ్చింది. భారత్, శ్రీలంక వేదికలుగా త్వరలో జరిగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో తాము ఆడే వేదికలను మార్చాలని ఐసీసీని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరింది. ఈ వినితిని ఐసీసీ తోసిపుచ్చింది. దీంతో ఐసీసీ టీ20 టోర్నికి దూరంగా ఉండాలని బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో గురువారం సమావేశమైన బీసీబీ ప్రస్తుత పరిస్థితుల్లో తమ జట్టు భారత్‌కు వెళ్లబోదని మరోసారి స్పష్టం చేసింది. టోర్నీ ఆడటానికి తమకు ఆసక్తి ఉందని, కానీ తమ మ్యాచ్‌లు భారత్‌లో నిర్వహించొద్దని పేర్కొంది. వేదికల తరలింపు అంశంపై ప్రతిష్ఠంభన తొలగించడానికి ఐసీసీతో సంప్రదింపులు జరుపుతామని బీసీబీ తెలిపింది. 'ఐసీసీ మాకు న్యాయం చేయలేదు. ఇది క్రికెట్‌కు సంబంధించిన అంశం మాత్రమే కాదు. మా ఆటగాళ్ల భద్రత విషయంలో వెనకడుగు వేయం' అని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అన్నారు.
కాగా, వచ్చే నెల 7వ తేదీ నుంచి ఈ టోర్నీ ప్రారంభంకానుంది. మొత్తం 20 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ కోసం బంగ్లాదేశ్.. భారత్‌కు రాని పక్షంలో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఆడించాలని ఐసీసీ భావిస్తోంది. అంతేకాక బంగ్లాపై ఐసీసీ చర్యలు కూడా చేపట్టే అవకాశముంది. ఈ టోర్నీ ఆదాయంలో తమ వాటాను కోల్పోవడంతో పాటు జరిమానాను కూడా బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) ఎదుర్కోవాల్సి రావచ్చు.
మరోవైపు, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో భారత అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రాగా, బీసీసీఐ ఆ దేశ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడంతో వివాదం రాజుకుంది. ప్రతిగా భారత్‌లో తమ భద్రతకు ముప్పు ఉందనే సాకుతో తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బీసీబీ.. ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. ఆ వినతిని తిరస్కరించిన ఐసీసీ భారత్‌కు వచ్చి మ్యాచ్‌లు ఆడాల్సిందేనని స్పష్టం చేసింది.