బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 అక్టోబరు 2015 (15:59 IST)

విరాట్ కోహ్లీ రికార్డును చెరిపేసిన సౌతాఫ్రికా ఓపెనర్ ఆమ్లా.. ఏంటా రికార్డు?

భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును దక్షిణాఫ్రికా ఓపెనర్ హాషీమ్ ఆమ్లా చెరిపేశాడు. అతి తక్కువ మ్యాచ్‌లు ఆడి ఆరు వేల పరుగులు చేసిన ఆటగాడిగా ఆమ్లా అవతరించాడు. ఇంతకుముందు ఈ రికార్డు కోహ్లీ పేరు మీద ఉండేది. ఇపుడు ఆమ్లా తన పేరుపై లిఖించుకున్నాడు. 
 
ప్రస్తుతం ముంబైలో భారత్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆమ్లా 23 పరుగులు చేసి ఎంఎం శర్మ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అయితే, అతని వ్యక్తిగత స్కోరు 15 పరుగులకు చేరుకోగానే 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 126 మ్యాచ్‌ల్లో 123 ఇన్నింగ్స్ ఆడి ఈ రికార్డును సృష్టించాడు. తద్వారా వన్డేల్లో వేగంగా 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నట్టయింది.
 
ఇంతకుముందు విరాట్ కోహ్లీ 144 మ్యాచుల్లో 136 ఇన్నింగ్స్ ఆడి 6 వేల పరుగులు పూర్తి చేశాడు. రిచర్డ్స్, గంగూలీ, డివిలియర్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇప్పటివరకు 126 వన్డేలు ఆడిన ఆమ్లా 6008 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు ఉన్నాయి. 84 టెస్టులు ఆడి 23 సెంచరీలు, 28 అర్ధసెంచరీలతో 6770 పరుగులు చేశాడు.