శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr

భారత్-ఆసీస్ ఆఖరి టీ20 నేడే.. క్లీన్‌స్వీప్‌పై ధోనీ సేన గురి

ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన వన్డే సిరీస్‌ పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే చాన్స్‌ ధోనీ సేనకు వచ్చింది. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే సదవకాశం ముందుంది. ఆస్ట్రేలియా పర్యటనను గెలుపుతో ముగించి.. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని అందుకునే గొప్ప అవకాశం ఇప్పుడు ధోనీసేన ముందు ఉంది. వన్డేల్లో తేలిపోయిన టీమిండియాకు.. ట్వంటీ20ల్లో ఆతిథ్య ఆసీస్‌ను చావు దెబ్బ తీసేందుకు ఇంతకుమించిన మంచి తరుణం రాదు. 
 
ఆసీస్‌ గడ్డపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించిన భారత్.. ఆదివారం జరిగే చివరి టీ-20లోనూ గెలిచి కంగారూలను వైట్‌వాష్‌ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని ఆసీస్‌ చూస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడినందున ఆతిథ్య జట్టుపైనే తీవ్ర ఒత్తిడి ఉండనుంది. కానీ, అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం పర్యాటక భారతకు కష్టాలు తప్పకపోవచ్చు. ఇప్పటికే సిరీస్‌ దక్కినా కెప్టెన్‌ ధోనీ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడడం లేదు. జట్టులో మార్పులతో టీమిండియాకు లాభంలేదని మహీ స్పష్టం చేశాడు. దీంతో దాదాపు తొలి రెండు మ్యాచ్‌ల జట్టునే కొనసాగించనున్నారు. 
 
ఈ మ్యాచ్ జరిగే సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ కూడా బ్యాటింగ్‌‌కు అనుకూలంగా ఉంది. ఇక్కడ కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. బౌన్స్‌ లభిస్తే మాత్రం పేసర్లు విజృంభించొచ్చు. అయితే భారతకు స్పిన్నర్ల ప్రదర్శన కీలకం కానుంది. అంతేకాకుండా, ప్రస్తుతం 117 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో నెగ్గితే 118 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న వెస్టిండీస్, అన్నే పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న శ్రీలంకను వెనక్కినెట్టి నంబర్‌వన్ స్థానానికి చేరుకుంటుంది.