కివీస్ ఉంచిన 154 పరుగుల లక్ష్యాన్ని పది ఓవర్లలో ఊదేశారు...
భారత్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ జట్టు గౌహతి వేదికగా ఆదివారం ఆతిథ్య భారత్‌తో మూడో టీ20 మ్యాచ్ తలపడింది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఉంచిన 154 పరుగుల విజయలక్ష్యాన్ని భారత క్రికెటర్లు కేవలం 10 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించారు. దీంతో మొత్తం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కివీస్ ఆటగాళ్లలో గ్లెన్ ఫిలిప్స్ (48; 40 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మార్క్ చాప్‌మన్ (32), శాంట్నర్ (27) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 3, రవి బిష్ణోయ్ 2, హార్దిక్ పాండ్య 2, హర్షిత్ రాణా ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు 10 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయలక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 20 బంతుల్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో 68 పరుగులు చేశాడు. అలాగే, సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో ఆరు ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 57 రన్స్ చేసి బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. ఇషాన్ కిషన్ (28; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంత సేపు షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ సిరీస్‌లో భాగంగా, నాలుగో టీ20 బుధవారం (జనవరి 28) విశాఖపట్నంలో జరగనుంది.