శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2015 (17:58 IST)

మొహాలీ టెస్ట్ : సఫారీలు 184 ఆలౌట్.. భారత్ రెండో ఇన్నింగ్స్ 125/2

మొహాలీ వేదికగా భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో భారత్ ఆటగాళ్లు పైచేయి సాధించారు. తొలి రోజున భారత జట్టు ఇన్నింగ్స్‌ను సఫారీ బౌలర్లు పేకమేడలా కూల్చివేసి పైచేయి సాధించిన విషయంతెల్సిందే. రెండో రోజు ఆటలో మాత్రం భారత బౌలర్లు అద్భుతంగా రాణించి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేసి కేవలం 184 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో రెండో రోజు ఆటలో కోహ్లీ సేన విజేతగా నిలిచింది.
 
కాగా, ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు తన ఓవర్ నైట్ స్కోర్ 28/2తో రెండో రోజైన శుక్రవారం ఉదయం ఆటను ప్రారంభించింది. అయితే, భారత స్పిన్నర్లు సఫారీ ఇన్నింగ్స్‌ను కకావికలం చేశారు. సఫారీ జట్టులోని టాప్ ఆర్డర్‌ను అశ్విన్ పెవిలియన్‌కు చేర్చగా, మిగిలిన బ్యాట్స్‌మెన్స్‌ను రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రాలు ఇంటికి పంపారు. ఫలితంగా సఫారీ జట్టు రెండో రోజు ఆటలో టీ విరామానికి ముందే 184 పరుగులకు ఆలౌట్ అయింది. 
 
సఫారీ బ్యాట్స్‌మన్‌లో డివిలియర్స్ (63) రాణించాడు. దీంతో భారత జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, ఆదిలోనే ధావన్ (0) వికెట్టును కోల్పోయింది. దీంతో మురళీ విజయ్ (47), ఛటేశ్వర్ పుజారా (63) మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేశారు. ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు సౌతాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా పదే పదే బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. 
 
ఈ క్రమంలో స్టెయిన్‌కు సబ్ స్టిట్యూట్‌గా వచ్చిన బవుమా అద్భుతమైన క్యాచ్‌కు విజయ్ పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన కోహ్లీ (11) అండగా పుజారా అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఈ జోష్‌తోనే ఈ టెస్టులో ఇప్పటివరకు నమోదు కానీ సిక్సర్‌ను బాదాడు. రెండో రోజు 40 ఓవర్లు ఆడిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. దీంతో 142 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంకా 8 వికెట్లు చేతిలో ఉన్నాయి. భారత జట్టు మరో 200 పరుగులు చేయగలిగితే భారత్ ముంగిట భారత్ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.