రాంచీ వన్డే : ఉత్కంఠ ఫోరులో సఫారీలపై భారత్ విజయం
రాంచీ వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. ఈ పోరులో ప్రత్యర్థిపై టీమ్ ఇండియా 17 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్ల వద్ద 332 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ (72), యాన్సన్ (70), బాష్ (67) కంగారు పెట్టినా.. గెలుపు భారత్ వశమైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ అనగానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే అందరి దృష్టి ఉంది. అభిమానుల అంచనాలను అందుకొంటూ మరోసారి వీరిద్దరూ చెలరేగిపోయారు. ఆసీస్‌పై మంచి ఫామ్ కనబరిచిన రోహిత్ (57) మళ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, విరాట్ కోహ్లీ (135: 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆటే హైలైట్. సాధారణంగా కోహ్లీ వన్డేల్లో సిక్స్‌లు కొట్టడం కాస్త తక్కువే. ఎక్కువగా ఫోర్లపైనే దృష్టిపెడతాడు. ఈసారి అందుకు భిన్నంగా సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్స్‌ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో శతకం చేసిన విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్‌లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు.
వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న కేఎల్ రాహుల్ (60) ఈ మ్యాచ్ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడినా.. చివరికి హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక ఆఖర్లో రవీంద్ర జడేజా (32: 20 బంతుల్లో) దూకుడు ప్రదర్శించాడు. అయితే, యశస్వి జైస్వాల్ (18), రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో యాన్సన్, బర్గర్, బార్ట్‌మన్, బాష్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
భారత్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు షాక్ మీద షాక్ తగిలింది. సఫారీ జట్టును హర్షిత్ రాణా దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో రికెల్టన్ (0), డికాక్ (0)ను వెనువెంటనే పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత మార్‌క్రమ్ (7) ఐదో ఓవర్లో అర్ష్‌దీప్ బౌలింగ్‌లో కీపర్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అప్పటికే క్రీజులో ఉన్న మాథ్యూ.. డిజార్జి(39)తో కలిసి నాలుగో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 15వ ఓవర్లో డిజార్జి.. కుల్‌దీప్ యాదవ్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రెవిస్ (37) 22వ ఓవర్లో హర్షిత్ వేసిన బంతిని సిక్స్‌గా మలిచే క్రమంలో రుతురాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అప్పటికి దక్షిణాఫ్రికా స్కోరు 130/5. భారత్ త్వరగానే మ్యాచ్‌ను ముగిస్తుందని అభిమానులు భావించారు. అనూహ్యంగా మాథ్యూ - యాన్సన్ జోడీ ఎదురుదాడికి దిగింది. వీరిద్దరూ కలిసి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, 34వ ఓవర్లో కుల్‌దీప్ వీరిద్దరిని పెవిలియన్‌కు పంపించి భారత్‌లో ఒక్కసారిగా ఊపుతీసుకొచ్చాడు.
ఆ తర్వాత వచ్చిన సుబ్రయెన్ (17)ను కూడా కుల్‌దీప్ ఔట్ చేశాడు. చివర్లో బాష్ పోరాడినా ఫలితం దక్కలేదు. ఆఖరి ఓవర్‌లో ప్రసిద్ధ్ వేసిన బంతిని భారీషాట్‌కు యత్నించి రోహిత్ చేతికి చిక్కి బాష్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత్ విజయం ఖాయమైంది. టీమ్‌ఇండియా బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, హర్షిత్‌రాణా 3, అర్ష్‌దీప్ 2, ప్రసిద్ధ్ ఒక వికెట్ తీశారు.