1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. IPL 2026: Why BCCI Banned Use Of Any Smart Goggles Or Smart Sunglasses Ahead Of Qualifier 2, Final

ఐపీఎల్ మ్యాచ్‌లకు కఠిన నిబంధనలు.. స్మార్ట్ సన్ గ్లాసెస్ ధరించడంపై నిషేధం

sun glasses
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2026)లో అవినీతి, అక్రమాలను అరికట్టేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మరో కఠిన నిర్ణయం తీసుకుంది. అధునాత టెక్నాలజీ ఎదురవుతున్న సవాళ్ళను ధీటుగా ఎదుర్కొనేందుకు యాంటీ కరప్షన్ యూనిట్ ద్వారా కీలక ఆదేశాలు జారీచేసింది. ఇకపై ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్బంగా ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు 'స్మార్ట్ సన్ గ్లాసెస్' ధరించడంపై పూర్తి నిషేధం విధించింది.
 
కొన్ని కంపెనీలు తమ స్మార్ట్ సన్ గ్లాసెస్‌ను ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బీసీసీఐ ఏసీఎస్ యూ ఫ్రాంచైజీలకు పంపిన అడ్వైజరీలో పేర్కొంది. ఈ కళ్లద్దాలలో మొబైల్ డేటా లేదా వైఫై ద్వారా లైవ్ స్ట్రీమింగ్, వీడియో కాలింగ్, టెక్స్ట్ మెసేజ్లు పంపే అధునాతన కమ్యూనికేషన్ ఫీచర్లు ఉన్నాయని వివరించింది. ఇవి అవినీతికి ఆస్కారం కల్పించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
 
ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (పీఎంఓఏ) నిబంధనల ప్రకారం ఇలాంటి స్మార్ట్ గ్లాసెస్‌ను ఆడియో/ వీడియో రికార్డింగ్ డివైజ్, కమ్యూనికేషన్ డివైజ్‌గా వర్గీకరించినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. అందువల్ల, మ్యాచ్ జరిగే రోజుల్లో పీఎంఓఏ పరిధిలో వీటిని వాడటంపై కఠిన నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆటగాళ్లు, సిబ్బంది తమ మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లతో పాటు ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను కూడా సెక్యూరిటీ అధికారికి తప్పనిసరిగా అప్పగించాలని ఆదేశించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం కఠిన చర్యలు, జరిమానాలు తప్పవని హెచ్చరించింది.
 
ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన రోమీ భిందర్ డగౌట్‌లో ఫోన్ వాడినందుకు లక్ష రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ క్రమశిక్షణ చర్యలను మరింత కఠినతరం చేసింది. ఇప్పటికే భద్రతా కారణాలు, హనీ ట్రాపింగ్ భయాలతో ఆటగాళ్లు బస చేసే హోటల్ గదుల్లోకి అతిథులను అనుమతించకపోవడం, అనుమతి లేకుండా రాత్రిపూట బయటకు వెళ్లడంపై నిషేధం వంటి కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. తాజా ఆదేశాలతో ఐపీఎల్ సమగ్రతను కాపాడటంలో బీసీసీఐ ఎంతటి పట్టుదలతో ఉందో మరోసారి స్పష్టమైంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
వినేశ్ ఫోగట్ దేశానికి గర్వకారణం : సుప్రీంకోర్టు