సోమవారం, 9 మార్చి 2026
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మార్చి 2026 (10:39 IST)

ఇదీ బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ అంటే... లెక్కలేసి మరీ నిర్భయంగా ఆడాడు... సంజూపై పాక్ ఫ్యాన్స్ ప్రశంసలు

sanju samson
భారత క్రికెటర్ సంజు శాంసన్‌పై పాకిస్తాన్ క్రికెట్ జట్టు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం రాత్రి కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టును సంజు శాంసన్ వీరోచిత పోరాటం చేసి ఒంటి చేత్తో గెలిపించాడు. అతని ఆట తీరుకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఇలాంటి వారిలో శత్రుదేశం పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. 
 
ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పాకిస్థాన్ అభిమానులు సంజును ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. "ఒత్తిడిలో ఎలా ఆడాలో సంజూ చూపించాడు. ఇదీ బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ అంటే" అని ఒకరు పేర్కొన్నారు. "ఈ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లి క్లాసిక్ ఛేజింగులను గుర్తు చేసింది. ప్రశాంతంగా, లెక్కలేసి, నిర్భయంగా కొట్టాడు" అని మరో అభిమాని కామెంట్ చేశాడు.
 
టోర్నమెంట్ ఎక్కువకాలం అవకాశం కోసం ఎదురుచూసి, వచ్చిన అవకాశాన్ని సంజూ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడని పలువురు కొనియాడారు. "జట్టులో చోటు సులభం కాదు, కానీ కీలక సమయంలో తన సత్తా చాటాడు. హ్యాట్సాఫ్" అని ఒకరు రాశారు. 
 
"వైరాలను పక్కనపెడితే, ఇది ఒత్తిడిలో ఆడిన స్వచ్ఛమైన క్లాస్ ఇన్నింగ్స్" అంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు. శాంసన్ ఈ ఇన్నింగ్స్‌లో భారత్‌కు కేవలం మ్యాచ్‌ను మాత్రమే గెలిపించలేదు, సరిహద్దుల ఆవల ఉన్న క్రికెట్ ప్రియుల మనసులను కూడా గెలుచుకున్నాడు.
 
కాగా, టీ20 ప్రపంచకప్ 2026 సెమీ ఫైనల్స్‌లోకి భారత్ అడుగుపెట్టింది. వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ సంజూ శాంసన్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ జట్టుకు విజయాన్ని అందించింది. కేవలం 3 పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నా, సంజూ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్‌పై ఇప్పుడు సరిహద్దులు దాటి ప్రశంసలు వెల్లువెత్తుతుండటం గమనార్హం.