సంజు శాంసన్.. ఓ ఛేజింగ్ మాస్టర్ : పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ
భారత క్రికెటర్ సంజు శాంసన్ ఓ ఛేజింగ్ మాస్టర్ అనిపించుకున్నాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టీ20 టోర్నీలో భాగంగా, గత ఆదివారం రాత్రి కోల్‌కతా వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను సంజు శాంసన్ ఒంటి చేత్తో గెలిపించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి మ్యాచ్ చివరి బంతి వరకు క్రీజ్‌లో నిలబడ్డాడు. పైగా, సెంచరీకి మూడు పరుగుల దూరంలో వచ్చి ఆగిపోయాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ తన వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలుపునకే తొలి ప్రాధాన్యత ఇచ్చాడు. ఫలితంగా టీమిండియా జట్టు ఐసీసీ టోర్నీలో మరోమారు సెమీస్‌కు చేరుకుంది.
దీంతో సంజు శాంసన్‌పై భారత మాజీ ఆటగాళ్లతో పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా అతడి ఆటతీరుకు మగ్ధులవుతున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ... సంజూ బ్యాటింగ్ తీరును ఆకాశానికెత్తేశాడు. సంజు క్రీజ్‌లో ఉన్నంతసేపు తనకు విరాట్ కోహ్లీ కనిపించాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సంజు బ్యాటింగ్‌ను నిశితంగా గమనిస్తే విరాట్ కోహ్లీ ఆటతీరు స్పష్టంగా కనిపించిందన్నారు. పేస్, స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని పరుగులు రాబట్టాడని పేర్కొన్నారు. చాలా స్పష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగి, పవర్ ప్లేలో దూకుడుగా ఆడి, ఆ తర్వాత పరిస్థితికి తగ్గట్టు తన ఆటను మార్చుకున్న తీరు అద్భుతమని విశ్లేషించారు.
ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత సంజూను ఛేజింగ్ మాస్టర్ అనొచ్చని, సాధారణంగా ఈ మాటను విరాట్ కోహ్లీ కోసం వాడుతామని, కానీ, ఈ మ్యాచ్‌లో సంజు ఆడిన విధానం ఆ బిరుదుకు న్యాయం చేసిందన్నారు. ఎవరి బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకోవాలి. ఎపుడు గేర్లు మార్చాలి, బంతిని ఏ ప్రదేశానికి పంపాలి అనే విషయాల్లో అతడికి పూర్తి స్పష్టత ఉందని, దాని ప్రకారం తన ప్రణాళికను అమలు చేశాడని బసిత్ అలీ కొనియాడారు.