క్రికెటర్ సంజూ శాంసన్‌పై సెలెబ్రిటీల ప్రశంసల వర్షం
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత క్రికెటర్ సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇపుడు అతనిపై అనేక మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మలయాళ అగ్ర నటులు మోహన్ లాల్, మమ్మూట్టి తదితరులు సంజూపై అభినందల వర్షం కురిపించారు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్పందిస్తూ, 'సంజూ అద్భుత ఫామ్లో ఉండటం చూడటానికి సంతోషంగా ఉంది. ఇది ఒక మాస్టర్ఫుల్ ఇన్నింగ్స్. ఇది అతని ప్రతిభతో పాటు వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. కష్ట సమయంలో జట్టును ఆదుకున్న తీరు అద్భుతం' అని ఆయన కొనియాడారు. ఇక ఈ విజయంతో సెమీస్‌కు చేరిన భారత్, గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.
మరోవైపు, ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మొదటి బంతి నుంచి చివరి వరకు క్రీజులో ఉండి, 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన వీరోచిత ఇన్నింగ్స్ టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించి సెమీఫైనల్ బెర్తును ఖాయం చేశాడు.
పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శాంసన్, ఆరంభం నుంచే బాధ్యతాయుతమైన ఆటతీరు కనబరిచాడు. లక్ష్య ఛేదనలో ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. నిలకడగా ఆడుతూనే, అవసరమైనప్పుడు అద్భుతమైన షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరి వరకు క్రీజులో పాతుకుపోయి విజయ లాంఛనాన్ని పూర్తి చేయడం ద్వారా తన క్లాసు, తెగువను ప్రదర్శించాడు. ఈ గెలుపుతో భారత్ సెమీ పైనల్‌కు దూసుకెళ్లింది.
ఈ అద్భుత ఇన్నింగ్స్ సంజూ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో ఛేజింగులో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ (82 నాటౌట్) పేరిట ఉన్న రికార్డును శాంసన్ (97 నాటౌట్) బద్దలు కొట్టాడు.
అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ధశతకాలు (6) సాధించిన భారత వికెట్ కీపర్‌గానూ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ఇషాన్ కిషన్ (5) రెండో స్థానంలో ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో సురేశ్ రైనా (101) తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రెండో భారత ఆటగాడిగానూ సంజూ నిలిచాడు.