శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2015 (14:11 IST)

మొహాలీ టెస్ట్ : సఫారీలు చావుదెబ్బ తీసిన భారత స్పిన్నర్లు.. 184 ఆలౌట్...

మొహాలీ టెస్టులో భారత స్పిన్నర్లు తమ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసి సఫారీ బ్యాట్స్‌మెన్లకు కళ్లెం వేశారు. ఫలితంగా ఈ టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు కేవలం 184 పరుగులకే కుప్పకూలింది. తద్వారా భారత్ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత కీలకమైన 17 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్.. ఆరంభంలోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధవాన్ తొలి ఇన్నింగ్స్‌ తరహాలోనే రెండో ఇన్నింగ్స్‌లో కూడా 8 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. 
 
ఇదిలావుండగా, గురువారం నుంచి మొహాలీ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్... బ్యాటింగ్ ఎంచుకుని, తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్‌కు దిగిన తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. 
 
రెండో రోజు ఆటలో భాగంగా శుక్రవారం ఉదయం తొలి రోజు ఓవర్ నైట్‌ స్కోరుతో బరిలోకి దిగి... 184 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ సఫారీ ఆటగాళ్ళను ఓ ఆట ఆడుకున్నాడు. కీలకమైన ఆటగాళ్లలో ఐదుగురిని అశ్విన్ అవుట్ చేయడంతో, చావు దెబ్బతిన్న సౌతాఫ్రికా జట్టులోని మిగతా ఆటగాళ్లను జడేజా, మిశ్రాలు పెవీలియన్ దారి పట్టించారు. దీంతో రెండో రోజు ఆటలో టీ విరామానికి ముందే 184 పరుగులకు ఆ జట్టు ఆలౌటైంది. 
 
అర్థ సెంచరీ చేసి చాలా సేపు భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన డివిలియన్స్ 63 పరుగుల వ్యక్తిగత స్కౌరు వద్ద మిశ్రా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. టెయిలెండర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. మొత్తం మీద 17 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత జట్టు  రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి తొలి వికెట్‌ను కోల్పోయింది. 
 
ఆట మరో మూడు రోజులకు పైగా మిగిలి ఉండటంతో ఫలితం వెలువడటం ఖాయంగా తెలుస్తోంది. రెండో ఇన్నింగ్స్ లో సఫారీ జట్టు ముంగిట 300 పరుగుల లక్ష్యాన్ని భారత్  ఉంచగలిగితే, విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.