భారత్‌లో చిక్కుకునిపోయిన వెస్టిండీస్ జట్టు
వెస్టిండీస్, జింబాబ్వే క్రికెట్ జట్లు భారత్‌లో చిక్కుకునిపోయాయి. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు కరేబియన్, జింబాబ్వే ఆటగాళ్లు భారత్‌కు వచ్చారు. అయితే, గత ఆదివారం కోల్‌కతా వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చేతిలో వెస్టిండీస్ జట్టు ఓడిపోయింది. దీంతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అలాగే, జింబాబ్వే కూడా న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అయితే, ఇరు జట్ల ఆటగాళ్లు భారత్‌ను వీడేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు చేస్తున్న వైమానిక దాడుల కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా ఆటగాళ్ల ప్రయాణ భద్రత కోసం తాము ఐసీసీ, సంబంధిత ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇరాన్ ప్రతిదాడి వల్ల దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతింది.
గల్ఫ్ ప్రాంతంలో సైనిక చర్య వల్ల ప్రయాణ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో అనేక అంతర్జాతీయ విమాన మార్గాలు ప్రభావితమయ్యాయి. భద్రత కారణాల దృష్ట్యా విమాన సంస్థలు ముందుగా షెడ్యూల్ చేసిన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.