ముంబై వాంఖడేలే అమీతుమీకి సిద్ధమైన భారత్ - ఇంగ్లండ్ జట్లు
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‍లో ఇరు జట్లూ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ చిరకాల ప్రత్యర్థులు టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో వరుసగా మూడోసారి అమీతుమీ తేల్చుకోనుండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గత రెండు టోర్నీల చరిత్రను పరిశీలిస్తే ఈ మ్యాచ్ ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. 2022, 2024 ప్రపంచ కప్‌లో భారత్ - ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీఫైనల్లో గెలిచిన జట్టే చివరికి ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అదే సెంటిమెంట్ పునరావృతం అవుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2022లో ఆస్ట్రేలియాలో జరిగిన సెమీఫైనల్ భారత అభిమానులకు ఒక పీడకలగా మిగిలిపోయింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, విరాట్ కోహ్లి (50), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 63) రాణించడంతో 168 పరుగులు చేసింది. అయితే, ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగారు.
భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వికెట్ నష్టపోకుండా కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఈ 10 వికెట్ల ఘోర పరాజయం తర్వాత టీ20 ఫార్మాట్లో జట్టు వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం భారత్‌కు 2024 ప్రపంచ కప్‌లో లభించింది. గయానాలోని క్లిష్టమైన పిచ్‌పై జరిగిన సెమీస్‌లో భారత్ అద్భుతంగా ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ (39 బంతుల్లో 57), సూర్యకుమార్ యాదవ్ (47) రాణించడంతో భారత్ 171 పరుగుల పోరాడే స్కోరు చేసింది. అనంతరం బౌలింగులో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ 103 పరుగులకే కుప్పకూలింది.
భారత్ 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లడమే కాకుండా ఆ టోర్నీలో ఛాంపియన్‌గా ఇప్పుడు 1-1తో సమంగా ఉన్న ఈ సెమీఫైనల్ పోరులో మూడోసారి పైచేయి ఎవరిదో తేలనుంది. వాంఖడే వేదికగా జరగనున్న ఈ హ్యాట్రిక్ సెమీ ఫైనల్లో గెలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.