టీ20 వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శన - పాకిస్థాన్ ఆటగాళ్లకు అపరాధం
భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు పేలవమైన ప్రదర్శన కారణంగా సూపర్-8 దశలోనే ఇంటిదారి పట్టారు. ఇది స్వదేశంలో తీవ్ర దుమారానికి దారితీసింది. జట్టు ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లతో సహా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పెద్దలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా, పేలవ ప్రదర్శనకు సంబంధించి ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారికి భారీ అపరాధం విధించాలని యోచిస్తున్నట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ టోర్నీలో పాకిస్థాన్ చిరకాల ప్రత్యర్థి భారత్, ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా, శ్రీలంకపై గెలిచినా మెరుగైన రన్‍రేట్ సాధించడంలో విఫలమై సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
అయితే, ఆటగాళ్లపై ఆర్థిక జరిమానాలు విధించాలన్న పీసీబీ ప్రతిపాదనను పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆటగాళ్లను బలిపశువులను చేస్తున్నారని, ఈ చర్య సరైంది కాదని మండిపడ్డాడు. 'జరిమానాలు విధించడమే పరిష్కారమైతే, సెలక్టర్ల నుంచి మొదలుకొని బోర్డు పరిపాలన అధికారుల వరకు అందరిపైనా విధించాలి. తప్పుడు జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లదే అసలు బాధ్యత. వారికి రెట్టింపు జరిమానా వేయాలి. ఎప్పుడూ ఆటగాళ్లే ఎందుకు శిక్ష అనుభవించాలి?' అని ఆమిర్ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ప్రశ్నించాడు. కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిన ఫఖర్ జమాన్‌కు కూడా జరిమానా వేస్తారా? అని నిలదీశాడు.
జరిమానాలు విధించడం సరైన పరిష్కారం కాదని, దేశవాళీ క్రికెట్‌ను మరింతగా బలోపేతం చేయడమే అసలైన మార్గమని ఆమిర్ సూచించాడు. 'నిజంగా ఎవరిపైనైనా కోపంగా ఉంటే జరిమానా వేయడం కాదు, జట్టు నుంచి తప్పించండి. రెండేళ్ల పాటు దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించి తిరిగి జట్టులోకి రావాలని చెప్పండి. ఒక క్రికెటర్‌కు జట్టులో స్థానం కోల్పోవడమే అతిపెద్ద శిక్ష' అని అతడు అభిప్రాయపడ్డాడు.