ఇంగ్లండ్ ఆటగాళ్లపై మీడియా నిప్పులు

Phani|
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ క్రికెటర్ల ఆటతీరుపై ఆ దేశ మీడియా నిప్పులు చెరిగింది. ఈ మ్యాచ్‌లో అద్భుతాలను ఆశించిన మీడియాకు ఆటగాళ్లు డ్రా వార్త అందించిన సంగతి తెలిసిందే. దీంతో మీడియా ఆగ్రహం చెందింది. ఇంగ్లాండ్‌ క్రికెటర్ల ఆటతీరుపై ఆ దేశ మీడియా విమర్శలు గుప్పించింది.

నాలుగేళ్ల క్రితం యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించిన ఇంగ్లాండ్‌ తిరిగి అదే ఫలితాన్ని రాబడుతుందని మీడియా భావించింది. అయితే చివరికి ఈ టెస్ట్‌ డ్రాగా ముగియడంతో మీడియాతో పాటు ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు కూడా ఆ దేశ ఆటగాళ్లపై విరుచుకుపడ్డారు.

ఇంగ్లండ్‌ పేలవమైన బౌలింగ్‌ కారణంగానే ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిందని దుయ్యబట్టారు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఫ్లింటాఫ్‌ పూర్తిగా విఫలం అయ్యాడని, ఫిట్‌నెస్‌ లేకుండానే అతను బరిలోకి దిగాడని మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ ఆరోపించాడు. ఇదిలా ఉంటే ఆట ఐదో రోజున స్ట్రాస్ కెప్టెన్‌గా పూర్తిగా విఫలమయ్యాడని మరో మాజీ కెప్టెన్ నిప్పులు చెరిగాడు.


దీనిపై మరింత చదవండి :