ఇంగ్లండ్ యాషెస్ జట్టులో సైడ్‌బాటమ్

Phani|
ఇంగ్లండ్ సెలెక్టర్లు నాలుగో యాషెస్ టెస్ట్ కోసం ఎంపిక చేసిన 14 మంది సభ్యుల ఆటగాళ్ల బృందంలో ఎడమ చేతివాటం ఫాస్ట్‌బౌలర్ రైయాన్ సైడ్‌బాటమ్, కొత్త బ్యాట్స్‌మన్ జోనాథన్ ట్రాట్‌లకు చోటు కల్పించారు. హీడింగ్లేలో శుక్రవారం ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ సెలెక్టర్లు ఈ రోజు జట్టును ప్రకటించారు.

ఇందులో మూడో టెస్ట్ బరిలో దిగిన 11 మంది ఆటగాళ్లు చోటు నిలుపుకున్నారు. గాయంతో బాధపడుతూ, పూర్తి ఫిట్‌నెస్‌తో లేడని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్‌పై కూడా సెలెక్టర్లు నమ్మకముంచారు. అతనికి కూడా నాలుగో టెస్ట్ జట్టులో చోటు కల్పించారు.

ఇదిలా ఉంటే మూడో టెస్ట్ బృందంలో ఉండి, మ్యాచ్‌లో ఆడే తుది జట్టులో అవకాశం దక్కించుకోని ఫాస్ట్‌బౌలర్ స్టీవ్ హార్మిసన్ కూడా నాలుగో టెస్ట్ బృందంలో ఉన్నాడు.

ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యతలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సెలెక్టర్లు జట్టులోకి ఎంపిక చేసిన ట్రాట్ అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త ముఖం కావడం గమనార్హం. అతనికి తుది జట్టులో అవకాశం వస్తుందో రాదో తెలియాలంటే నాలుగో టెస్ట్ వరకు వేచిచూడాల్సిందే.


దీనిపై మరింత చదవండి :