మూడో వన్డే: ఇంగ్లండ్‌కు తప్పని పరాజయం

Phani|
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న నాట్‌వెస్ట్ సిరీస్ మూడో వన్డేలోనూ ఇంగ్లండ్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. సౌతాంప్టన్‌లో జరిగిన మూడో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో ఏడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యత 3-0కి పెరిగింది.

ఆసీస్ తాజా మ్యాచ్‌లో 229 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో తొమ్మిది బంతులు మిగిలివుండగానే ఛేదించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ కామరూన్ వైట్ (105) సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ మైకేల్ క్లార్క్ (52) కూడా రాణించాడు.

వీరిద్దరూ మూడో వికెట్‌కు 143 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి ఆస్ట్రేలియా విజయాన్ని సునాయాసం చేశారు. కామరూన్ వైట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

కెప్టెన్, ఓపెనర్ ఆండ్ర్యూ స్ట్రాస్ (63) ఒక్కడే ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.

మిగిలినవారిలో ఈజీ మోర్గాన్ (43), బ్రెస్నాన్ (31 నాటౌట్) ఓ మోస్తారుగా రాణించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఆసీస్ బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో షేన్ వాట్సన్ మూడు వికెట్లు పడగొట్టగా, జాన్సన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.


దీనిపై మరింత చదవండి :