లీపై ఆస్ట్రేలియా, ఫ్రెడ్డీపై ఇంగ్లండ్ నమ్మకం

Phani|
యాషెస్ సిరీస్‌లో నాలుగో టెస్ట్‌‍కు ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాడని ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో గాయం కారణంగా తొలి మూడు టెస్ట్‌లకు బ్రెట్ లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. లీడ్స్‌లో జరిగే నాలుగో టెస్ట్‌కు లీ అందుబాటులో ఉండే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పాంటింగ్ చెప్పాడు.

యాషెస్ సిరీస్‌లో మూడో టెస్ట్ డ్రాగా ముగియడంతో ఆస్ట్రేలియా 0-1తో వెనుకబడి ఉన్న సంగతి తెలిసిందే. లీడ్స్‌లో శుక్రవారం ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్‌లో లీకున్న అపార అనుభవం ఆస్ట్రేలియాకు కలిసొస్తుందని పాంటింగ్ నమ్మకం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌‍కు లీ అందుబాటులో ఉంటాడని భావిస్తున్నాను.

గత కొన్ని రోజులుగా లీ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. నాలుగో టెస్ట్‌కు అతని రాక జట్టుకు మేలు చేస్తుంది. అందువలన అతనిపై దృష్టి కేంద్రీకరిస్తామని పాంటింగ్ చెప్పాడు. ఇదిలా ఉంటే ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ కూడా నాలుగో టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడని ఆతిథ్య జట్టు కెప్టెన్ స్ట్రాస్ ధీమా వ్యక్తం చేశాడు.

మూడో టెస్ట్ చివరి రోజున బౌలింగ్ చేస్తూ ఫ్రెడ్డీ కిందపడ్డాడు. దీంతో నాలుగో టెస్ట్‌కు అతను అందుబాటులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. స్ట్రాస్ మాత్రం ఫ్రెడ్డీ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని చెప్పాడు. అతనికి మోకాలి సమస్య ఉంది. అయితే తరువాతి మ్యాచ్‌కు ఫ్లింటాఫ్ అందుబాటులో ఉంటాడని నమ్మకం వ్యక్తం చేశాడు.


దీనిపై మరింత చదవండి :