ఆల్‌రౌండర్‌గా అదరగొడుతా..!: పియూష్ చావ్లా వ్యాఖ్య

SELVI.M|
FILE
ఉత్తరప్రదేశే లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాడు. తనకు దొరికిన సూపర్ ఛాన్సును సద్వినియోగం చేసుకుంటానని చావ్లా అన్నాడు. బౌలర్లకు అనుకూలంగా ఉండే దక్షిణాఫ్రికా పిచ్‌లపై రాణిస్తాననే విశ్వాసం తనకుందని చావ్లా పేర్కొన్నాడు.

తన శక్తి మేరకు మైదానంలో మెరుగ్గా ఆడేందుకు కృషి చేస్తానని చావ్లా తెలిపాడు. ఈ సిరీస్‌లో ఇటు బౌలింగ్‌లోనూ, అటు బ్యాటింగ్‌లోనూ రాణించాలని కోరుకుంటున్నానని, అందుకు సన్నద్ధమవుతున్నానని చావ్లా వెల్లడించాడు.

భారత జట్టులో ఆల్‌రౌండర్ స్థానం ఖాళీ ఉందనే విషయం తెలుసుకున్న చావ్లా, వికెట్లు తీసుకోవడమే తన ప్రధాన కర్తవ్యమని చెబుతున్నాడు. భారత ఉపఖండంలో వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ జరగడానికి ముందు దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ ఆడటం తన నైపుణ్యాన్ని పరీక్షించుకోవడానికి లభించిన చక్కని అవకాశమని చావ్లా పేర్కొన్నాడు.

సుమారు రెండేళ్ల తర్వాత భారత జట్టులో చోటు సంపాదించిన చావ్లా చివరిసారిగా కరాచీలో పాకిస్థాన్‌పై భారత జట్టులో ఆడాడు. సఫారీ గడ్డపై ఆతిథ్య దక్షిణాఫ్రికాతో భారత జట్టు 2011 జనవరి 9 నుంచి ఆడనున్న ఐదు వన్డేల సిరీస్‌కు, ఒక ట్వంటీ 20 మ్యాచ్‌కు చావ్లా ఎంపికయ్యాడు. ఇంకా ప్రపంచ కప్‌కు సెలక్టర్లు ఎంపిక చేసిన 30 మందితో కూడిన ప్రాబబుల్స్‌లో చావ్లాకు చోటు దక్కింది.

దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో, ట్వంటీ 20 మ్యాచ్‌లో రాణిస్తే ప్రపంచ కప్ తుది జట్టులో చోటు లభించే అవకాశాలు చావ్లాకు మెరుగుపడతాయి. అలీగఢ్‌లో జన్మించిన చావ్లాకు 2006లో మొహాలీలో ఇంగ్లాండ్‌తో ఆడిన టెస్టులో భారత జట్టులో తొలిసారి స్థానం లభించింది.

పియూష్ చావ్లా ఫ్రొఫైల్:
ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లు: 6
పరుగులు : 305 ఇందులో రంజీ ట్రోఫీలో తొలి సెంచరీ కూడా ఉంది.
సగటు : 44.07
పడగొట్టిన వికెట్లు : 14.


దీనిపై మరింత చదవండి :