స్వదేశంలో జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 4-0 తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ ఆటగాళ్లతో బ్యాటింగ్, బౌలింగ్ సగటుల్లో భారత జట్టు నుంచి సీనియర్ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ఒక్కడే పోటీపడ్డాడు. చెరో డబుల్ సెంచరీ, శతకం చేసి 106.60, 84 సగటులతో వరుసగా 533, 504 పరుగులు చేసిన కెవిన్ పీటర్సన్, ఇయాన్ బెల్‌లు బ్యాటింగ్ పట్టికలో తొలి రెండు స్థానాలను పొందారు. 76.83 సగటుతో 461 పరుగులు చేసిన ద్రవిడ్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ద్రవిడ్ టెస్ట్ సిరీస్‌లో మూడు సెంచరీలు చేశాడు. ఒక సెంచరీ చేసి 48 సగటుతో 348 పరుగులు సాధించిన ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్, టెస్ట్ ఓపెనర్ అలెస్టర్ కుక్ నాలుగో స్థానంలో ఉన్నాడు.