2007లో అవుట్... మరి 2011లో కప్ ఎలా సాధ్యమైంది..?!!

Hanumantha Reddy|
PTI
28 సంవత్సరాల తర్వాత భారత జట్టు ప్రపంచ కప్ గెలుచుకుని భారతదేశ క్రికెట్ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపంచ కప్‌ గెలవటానికి తాము మాత్రమే అర్హులమని భావించే ఆస్ట్రేలియా అహంకారాన్ని చిత్తు చేయటంతో పాటు చిరకాల ప్రత్యర్థి దాయాది పాకిస్థాన్‌కు చెమటలు పట్టించి ఫైనల్‌కు చేరిన టీమిండియా గత కొన్ని సంవత్సరాలుగా శ్రీలంకపై ఫైనల్లో ఓటమి చెందే ఫోబియాను ఛేదించి చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయానికి ధోనీ కెప్టెన్సీ, కిర్‌స్టెన్ కోచింగ్, ఆటగాళ్ల అంకితభావం ప్రధాన కారణాలనడంలో సందేహం లేదు. అయితే 2007 ప్రపంచ కప్‌లో దారుణమైన వైఫల్యమే ప్రస్తుతం విజయానికి ఆక్సీజన్ అంటున్నారు విశ్లేషకులు.

రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు 2007లో పేలవమైన ఆటతీరుతో బంగ్లాదేశ్ వంటి చిన్న జట్టుపై కూడా ఓటమి చెంది లీగ్ దశలోనే టోర్నీకి టాటా చెప్పింది. దీనికి ప్రధాన కారణం నాటి జట్టు ఎంపిక. ప్రపంచకప్ బరిలో దిగిన ఆ జట్టు ఫీల్డింగ్ దారుణంగా చేసింది. బౌలింగ్, బ్యాటింగ్‌లలో కూడా అంతంత మాత్రమే.

నూరు కోట్ల జనాభా ఉన్న భారత్ వంటి పెద్ద దేశం లీగ్ దశలో నిష్క్రమించడానికి దేశంలో ప్రతిభావంతులు లేకపోవడం కాదు బీసీసీఐ వైఖరి, జట్టు ఎంపికలో అశ్రిత పక్షపాతం కారణమని భావించిన జీ గ్రూప్ ఛైర్మన్ బీసీసీఐ గుత్తాధిపత్యాన్ని ఛాలెంజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న యూత్ టాలెంట్‌ను సరైన గుర్తింపునివ్వాలనే ఉద్దేశంతో 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్)ను ప్రారంభించారు.

ఎక్కువ మొత్తంలో సొమ్ము ముడుతుండటంతో దేశ, విదేశీ ఆటగాళ్లు ఐసీఎల్‌లోకి క్యూ కట్టారు. దీంతో తమ మనుగడకే ముప్పని భావించిన బీసీసీఐ ఇతర దేశాలతో పాటు ఐసీసీతో చర్చించిన తర్వాత బీసీసీఐ ఉపాధ్యక్షుడు లలిత్ మోడి నేతృత్వంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను ప్రారంభించింది. 2008లో ఎనిమిది ఫ్రాంఛైజీలతో ప్రారంభమైన ఐపీఎల్ అనూహ్య రీతిలో ఆదరణ పొందింది.

దేశంలో చాలా మంది యువ ఆటగాళ్ళను వెలుగులోకి తీసుకు వచ్చింది. విరాట్ కోహ్లి, అశ్విన్, యూసఫ్ పఠాన్, రైనా, మనీష్ పాండే, పీయూష్ చావ్లా వంటి క్రికెటర్లు ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చారు. ఐపీఎల్ వల్ల లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఇలాంటి ఆటగాళ్లు భారత జట్టులోకి రావడంతో జట్టులో పాత వాసనపోయి చురుకైన ప్రొపెషనల్ టీమ్‌గా రూపొందింది. ముఖ్యంగా ఫీల్డీంగ్ విభాగంలో జట్టు ఎంతో మెరుగైనదిగా కనబడుతోంది.

ప్రస్తుత ప్రపంచ కప్ గెలవడంలో ఫీల్డింగ్ కీలక పాత్ర పోషించిందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అదే విధంగా జట్టులో వచ్చిన మరో కీలక మార్పు ఒత్తిడిని చిత్తు చేయటం. సచిన్, సెహ్వాగ్ అవుట్ అయ్యారంటే ఇక ఓటమి తప్పదన్న భయం నుండి బయటపడగలుతోంది. భారత జట్టు ఈ లక్షణాన్ని వదిలించుకొని చివరి వరకు పోరాడటం నేర్చుకుంది. జట్టులో సమిష్టితత్వం కూడా వచ్చింది. మొత్తంమీద మన విజయానికి నాలుగు సంవత్సరాల క్రితం సుభాష్ చంద్ర చేసిన ఆలోచన దోహదపడింది. సో మెనీ థ్యాంక్స్ టూ.. సుభాష్ జీ.


దీనిపై మరింత చదవండి :