ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్న తల్లిదండ్రులు.. 9వ ఫ్లోర్ నుంచి దూకేసిన అక్కా చెల్లెళ్లు
ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు తొమ్మిదో అంతస్తు నుంచి కిందకు దూకేసి ఆత్మహత్య చేసుకున్నారు. సంచలనంగా మారిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఘజియాబాద్ నగరంలోని రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లో నివసిస్తున్న ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు (12,14,16 ఏళ్ల వయసు) కలిసిమెలిసి ఉండేవారు. అయితే కరోనా సమయంలో వారికి ఫోన్ చూడటం అలవాటైంది. తర్వాత ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం వ్యసనంగా మారిపోయింది.
ఇందుకోసం చదువును కూడా పక్కనపెట్టేశారు. రోజూ స్కూల్‌కు వెళ్లడం కూడా మానేశారు. వారి ప్రవర్తనపై ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. ఫోన్ వినియోగం తగ్గించాలంటూ పిల్లలను మందలించేవారు. మంగళవారం రాత్రి ఇదే విషయమై ఇంట్లో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే ఆ ముగ్గురూ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టౌన్‌షిప్‌లోని 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా శబ్దం వినిపించడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై వెంటనే పోలీసులకు సమాచారం అందింది. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో బాలికల మృతదేహాలను గుర్తించారు. వాటిని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.