మంగళగిరిలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, నిందితుల్లో తండ్రీకొడుకులు
మంగళగిరిలో దారుణం జరిగింది. నలుగురు కామాంధులు 13 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు నలుగురిలో ఇద్దరు తండ్రీకొడుకులు వున్నారు. పోలీసులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. డిశెంబరు 18 రాత్రి పది గంటలకు బాలిక తన స్నేహితులతో కలిసి వుంది. ఆమెతో మాటలు కలిపి మెల్లగా ఆమెను ఆటో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత బాలికను మంగళగిరి బైపాస్ రోడ్డు పక్కనే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లారు.
బాలికను తీసుకెళ్లినవారిలో 50 ఏళ్ల ఖాదర్ బాషా, 42 ఏళ్ల సలీమ్, 39 ఏళ్ల రబ్బానీ వున్నారు. వీరు ముగ్గురూ బాలికపై సామూహిక అత్యాచారనికి పాల్పడ్డారు. అనంతరం బాలికను మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి కాలనీ చివరి వరకూ తీసుకని వెళ్లిన సలీమ్ మరోసారి ఆమెపై అత్యాచారం చేసాడు. అనంతరం ఖాదర్ బాషాతో అతని 25 ఏళ్ల కుమారుడు కమల్ సాహెబ్ కూడా కలిసాడు. ఇద్దరూ ఆమెను ఆటోలో తీసుకుని వెళ్లి అత్యాచారం చేసారు.
ఆ తర్వాత బాలికను రబ్బానీ అనే కామాంధుడు తీసుకుని వెళ్తుండగా బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు ఆటోని అడ్డగించి బాలికను విడిపించారు. ఇంటికి వెళ్లిన బాలిక జరిగినదంతా తన తల్లితో చెప్పింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితులను మంగళగిరి డాన్ బాస్కో వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకి తరలించారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులు నలుగురిని నడిరోడ్డుపై నడిపిస్తూ జైలుకి తరలించారు.