విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...
నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెళ్లి పోలీసు స్టేషను పరిధిలో ఈ నెల 8న దారుణమైన స్థితిలో ఓ మహిళ శవం లభించింది. ఆ మహిళ మృతదేహాన్ని దహనం చేయడంతో గుర్తుపట్టేందుకు పోలీసులకు సవాలుగా మారింది. ఐతే ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఐతే ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
స్థానిక కొల్లాపూర్ పట్టణంలో స్వర్ణలత అనే 38 ఏళ్ల మహిళ గత ఏడేళ్ల క్రితం భర్తతో మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగా వుంటోంది. ఈ మహిళ దగ్గరికి 23 ఏళ్ల విజయ్ కుమార్ అనే యువకుడు వచ్చేవాడు. ఆ పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారి తీసింది. దాంతో ఇద్దరూ గత కొన్నేళ్లుగా ఈ బంధాన్ని సాగిస్తూ వచ్చారు. ఇంతలో విజయ్ కు మరో అమ్మాయి పరిచయం అయ్యింది. ఆమె విషయం స్వర్ణలతకు తెలియడంతో గొడవ చేసింది. తనతో సంబంధం పెట్టుకున్న కారణంగా తననే పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తడి చేయడం మొదలుపెట్టింది. అయినా కుమార్ ఆమె మాటలను లైట్ తీసుకుని ప్రియురాలితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నాడు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్వర్ణలత తామిద్దరూ ఏకాంతంగా గడిపిన ఫోటోలను కుమార్ తల్లిదండ్రులకు చూపిస్తానంటూ హెచ్చరించింది. విషయం బైటపడితే పరిస్థితి ఏమవుతుందోనని ఆలోచన చేసిన కుమార్... ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసాడు. మాట్లాడుకుందాం రమ్మని స్వర్ణలతకు ఫోన్ చేసి ఆమెను బైకు ఎక్కించుకుని సాకలి రామునిగుట్టపైకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ గొడవపడ్డారు. అప్పటికే ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న కుమార్ గొంతు పిసికి ఆమెను హతమార్చాడు.
అనంతరం ఎవ్వరూ గుర్తుపట్టకుండా వుండేందుకు ఆమె మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఐతే తమ కుమార్తె కనబడటం లేదంటూ కొల్లాపూర్ లోని పోలీసు స్టేషనులో తన కుమార్తె స్వర్ణలత కనిపించడం లేదంటూ తండ్రి బాలస్వామి ఫిర్యాదు చేయడంతో పోలీసుల పని సుళువైంది. నిందితుడు కుమార్ ను పోలీసులు సులభంగా పట్టేసారు. దాంతో అతడు తను చేసిన నేరాన్ని పూసగుచ్చినట్లు చెప్పేసాడు.