ఎలాగూ చేసుకున్నావుగా, ఇంకేం చేస్తాం ఇంటికిరా అల్లుడూ అని చెప్పి హత్య చేసారు
పంజాబ్ రాష్ట్రంలో అత్యంత దారుణమైన హత్య జరిగింది. పట్టపగలే అందరూ చూస్తూ వుండగానే 20 ఏళ్ల యువకుడిని అతడి బావమరుదులు ఇద్దరే హత్య చేసారు. బస్టాండ్ వద్దకు రాగానే అతడి కోసం కాపు కాచినవారు ఈ దారణానికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని కద్గిల్ నివాసి అయిన తార్సెమ్ సింగ్ కుమారుడు జగ్జీత్ సింగ్. ఇతడు జషన్ కౌర్ అనే యువతిని ప్రేమించాడు. ఆమె కూడా ఇతడితో సన్నిహితంగా వుంటూ వస్తోంది. ఇది కాస్తా యువతి ఇంట్లో తెలిసింది. దీనితో జషన్ కౌర్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
జగ్జీత్‌ను కలవవద్దని, అతడిని మరిచిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఐతే జగ్జీత్ లేనిదే తను వుండలేనని నిర్ణయించుకున్న జషన్ కౌర్ ఇంటి నుంచి నెల రోజుల క్రితం వెళ్లిపోయి అతడిని ప్రేమ వివాహం చేసుకున్నది. ఇక అప్పట్నుంచి జషన్ కౌర్ సోదరులిద్దరూ జగ్జీత్ పైన కక్ష పెంచుకున్నారు. ఐతే అదేమీ బైటకు తెలియనీయకుండా అతడిని నమ్మించారు. జషన్ కౌర్ తల్లితో అతడికి ఫోన్ చేయించారు. ఆమె జగ్జీత్‌కు ఫోన్ చేసి... ఎలాగూ పెళ్లయిపోయింది కదా, ఇక మనమధ్య గొడవలెందుకు, ఒకసారి మా ఇంటికి వస్తే మాట్లాడుకుందాము అంటూ పిలిచింది. దీనితో అతడు ఎంతో ఉత్సాహంగా దుకాణంలో కూల్ డ్రింక్స్, చిరుతిండ్లకు సంబంధించిన ప్యాకెట్లు కొనుగోలు చేసి బస్ ఎక్కి వెళ్లేందుకు బస్టాండుకి వచ్చాడు.
అప్పటికే అక్కడ కాపు కాచి వున్న జషన్ కౌర్ సోదరులు ఇద్దరూ ఒక్కసారిగా అతడిపై కత్తులతో దాడి చేసారు. ముఖం పైన, మెడపైన విచక్షణారహితంగా కత్తులతో పొడిచేసారు. దీనితో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులు ఇద్దరిలో ఒకరిని అరెస్ట్ చేసారు. మరో నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
