కోడిగుడ్డు కూర దగ్గర భార్యాభర్తల మధ్య గొడవ, ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య
ఇటీవలి కాలంలో చిన్నచిన్న గొడవలకే భార్యాభర్తలు ప్రాణాలు తీసుకునేవరకూ వెళ్లిపోతున్నారు. చాలా చిన్నగొడవలు. అంతదానికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి ఘటన మరొకటి జరిగింది. భార్య కోడిగుడ్డు కూర వండలేదన్న కోపంతో భర్త ఆగ్రహం వ్యక్తం చేసాడు. అంతేకాదు.. తనే ఆ కూర వండుకుని తినబోతున్న తరుణంలో భార్య అతడిపై మరోసారి గొడవకు దిగింది. మాటామాటా పెరిగింది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బందాలో 28 ఏళ్ల శుభమ్ అనే పేరు గల వ్యక్తి పెయింటింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నాడు పెయింట్ పని ముగించుకుని వచ్చే ముందు భార్యకు ఫోన్ చేసి తను వచ్చేలోపుగా కోడిగుడ్డు కూర వండిపెట్టమన్నాడు. ఐతే శుభమ్ మాటను అతడు భార్య అస్సలు పట్టించుకోలేదు.
ఇంటికి వచ్చిన శుభమ్ ఎంతో ఆకలితో కోడిగుడ్డు కూర వేసి అన్నం పెట్టమన్నాడు. కూర వండలేదని చెప్పింది భార్య. దీనితో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ గొడవ చేసుకుంటూనే శుభమ్ కోడిగుడ్డు కూర వండేసాడు. అన్నం పెట్టుకుని తినబోతుండగా మరోసారి గొడవ పడింది భార్య. అంతేకాకుండా ఇంటి బైటకు వెళ్లి పెద్దపెద్దగా కేకలు వేస్తూ తిట్టడం మొదలుపెట్టింది. దీనితో కోడిగుడ్డు కూర కోసం ఇంతలా రోడ్డెక్కి గొడవ చేయడంపై తన పరువు పోయిందని ఆవేదన చెందిన శుభమ్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడు ప్రాణాలు తీసుకోవడంపై అతడి తల్లి కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.