సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మార్చి 2026 (11:04 IST)

కుటుంబ కలహాలు.. అత్తతో వంట చేసే విషయంలో గొడవ.. మాజీ టెక్కీ ఆత్మహత్య

Crime
కుటుంబ కలహాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది మహిళలు. ఒకవైపు ఎక్కడపడితే అక్కడ మహిళలపై అకృత్యాలు జరుగుతుంటే.. మరోవైపు గృహ హింస కూడా పెచ్చరిల్లిపోతుంది. ఆధునికత పెరిగినా మహిళలపై అసాంఘిక ఘటనలకు కళ్లెం వేయటం జరగట్లేదు. 
 
తాజాగా బెంగళూరులో కుటుంబ కలహాల కారణంగా మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేయగా, అత్త పరారీలో ఉన్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. గతంలో డెల్ కంపెనీలో పనిచేసిన 35 ఏళ్ల సుష్మకు ఐదేళ్ల క్రితం పునీత్ కుమార్‌తో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఆమె ఆత్మహత్యకు కారణమైంది. అలాగే అత్తమ్మ కూడా ఆమెతో తరచూ గొడవపడేది. మంగళవారం వంట చేసే విషయంలో సుష్మకు, ఆమె అత్త కల్పనకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
 
వంట చేయనివ్వకుండా అత్త తనను నిత్యం వేధింపులకు గురిచేసేదని సుష్మ తన కుటుంబ సభ్యులతో చెప్పినట్లు సమాచారం. ఈ గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మ, ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
సుష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. దీంతో భర్త పునీత్‌ను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న అత్త కల్పన కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.