1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Chennai man who confronted drug dealers dies after assault; AIADMK slams Vijay

గంజాయి విక్రయాలను ప్రశ్నించిన యువకుడు.. కొట్టి చంపేసిన ముఠా

murder
చెన్నైలో ఓ దారుణం జరిగింది. గంజాయి విక్రయాలను ప్రశ్నించిన ఓ యువకుడిని గంజాయి ముఠా దారుణంగా కొట్టి చంపేసింది. ఈ ఘటన ఉత్తర చెన్నైలోని తండయారుపేట ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక తండయారుపేటలో గంజాయి విక్రయాలను గమనించిన విష్ణు అనే యువకుడు విక్రయ ముఠా సభ్యులను ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ముఠా సభ్యులు.. విష్ణును చుట్టుముట్టి బీరు సీసాలు, సుత్తి, ఇతర మారణాయుధాలతో విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విష్ణు... చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అక్కడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘోరానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 
ఈ హత్య తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి (ఈపీఎస్) ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. "ఈ ప్రభుత్వంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని ప్రశ్నిస్తే హత్యే సమాధానమా? వీరు చెబుతున్న మార్పు ఇదేనా?" అని ప్రశ్నించారు. 
 
కాగా, మంగళవారం తిరుచిరాపల్లిలో ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ.. తనపై నిరాధారమైన ఆరోపణలు వస్తున్నాయని వ్యక్తంచేసిన అసహనాన్ని ఈ సందర్భంగా పళనిస్వామి ప్రస్తావించారు. కేవలం అధికారులను నియమిస్తేనే సరిపోతుందా అని, ప్రతి ప్రభుత్వంలోనూ పనిచేసేది ఈ అధికారులేనని, మార్పు అనేది పాలకుల నుంచి రావాలని ఆయన హితవు పలికారు.
 
పోలీస్ శాఖను తన ఆధీనంలో ఉంచుకున్న వ్యక్తి, శాంతిభద్రతల బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడటం సిగ్గుచేటని, డ్రగ్స్ మహమ్మారిని తాను నిర్మూలించలేకపోతున్నానని ముఖ్యమంత్రి పరోక్షంగా అంగీకరించినట్లేనని పళనిస్వామి ఆరోపించారు. 'పరిపాలన ఎలా చేయాలి' అనే ఆరు నెలల క్రాష్ కోర్సును మీరు పూర్తి చేసే వరకు ప్రజలు ఇలాగే ప్రాణాలు కోల్పోతూ బాధపడాలా? కనీసం ఎవరూ ప్రశ్నించడానికి కూడా వీల్లేదా? అంటూ తీవ్రస్థాయిలో నిలదీశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కర్నాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకారం