హస్తినలో దారుణం : వ్యాపారిని హెల్మెట్లతో కొట్టి చంపేసిన ఫుడ్ డెలివరీ బాయ్స్
దేశ రాజధాని హస్తినలో దారుణం జరిగింది. ఓ వ్యాపారిని ముగ్గురు ఫుడ్ డెలివరీ బాయ్స్ కిరాతకంగా హెల్మెట్లతో కొట్టి చంపేశారు. కనాట్ ప్లేస్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో శివమ్ గుప్తా (36) అనే వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. చిన్న వాగ్వాదంతో మొదలైన ఈ గొడవ హత్యకు దారితీసింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... జనవరి 3వ తేదీన శివమ్ గుప్తాకు ముగ్గురు ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితులు హెల్మెంట్లతో శివమ్‌పై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యాపారిని స్థానికులు, పోలీసులు కలిసి సమీపంలోని ఆస్పత్రికి తరలించగా దాదాపు 16 రోజుల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 19వ తేదీన ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడు శివమ్ గుప్తా, పహాడ్ గంజ్‌లో వ్యాపారం చేసే అనిలా కాంత్ గుప్తాకు ఏకైక కుమారుడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్మనారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.