బావ హత్య కేసులో ప్రధాన నిందితుడు కుటుంబంతో సహా ఆత్మహత్య.. ఎక్కడ?
సొంత అక్క భర్తను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణం ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషనులో జరిగింది. మృతులను కుడుముల హరికృష్ణ, అతని భార్యాపిల్లలుగా గుర్తించారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండల వ్యవసాయాధికారి ఎన్.శ్రీహరి హత్య కేసులో హరికృష్ణ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సింగరాయకొండ రైల్వేస్టేషన్‌కు భార్యాపిల్లలతో కలిసి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. హరికృష్ణ జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా అతడిని పోలీసులు గుర్తించారు.
జూన్ 15వ తేదీన బుచ్చిరెడ్డిపాళెం మండల వ్యవసాయాధికారి శ్రీహరిని తన బావమరిది హరికృష్ణ కారులో పెంచలకోనకు తీసుకెళ్లారు. దైవ దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా మార్గమధ్యలో శ్రీహరి మృతిచెందారు. గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరించారు. ఆయన శరీరంపై గాయాలున్నట్లు మృతుడి బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ మాతంగి శ్రీనివాసరావు పరిశీలించి వెళ్లిపోయారు. కేసు నమోదుగానీ, అనుమానితులను విచారించడంగానీ చేయలేదు. ఆ తర్వాత శవాన్ని దహనం చేశారు.
ఈ క్రమంలో మృతుడు భార్య లావణ్య... తన భర్త హత్యకు గురయ్యారని పీజీఆర్‌ఎస్‌లో జులై 6న ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ అజిత.. విచారణ చేయాలని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావును ఆదేశించారు. కుక్కలను చంపే ఇంజెక్షన్లు ఇచ్చి బావమరిది హరికృష్ణ.. ఆస్తి కోసం శ్రీహరిని చంపేసినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. ఇదే కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై బుచ్చిరెడ్డిపాళెం పీఎస్‌లోని సిబ్బంది 23 మందినీ ఒకేసారి జిల్లా ఎస్పీ బదిలీ చేశారు. సీఐను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలిచ్చారు.
