గద్వాల్‌లో దారుణం : మైనర్ కుమార్తెను గర్భవతిని చేసిన తండ్రి
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్‌లో దారుణం జరిగింది. కామాంధుడైన తండ్రి పదహారేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చడంతో ఎవరికీ తెలియకుండా అబార్షన్ చేయించాడు. ఇందుకు అతని మొదటి భార్య సైతం సహకరించింది. అయితే, బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
జిల్లా కేంద్రమైన గద్వాల్‌కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పిల్లలు పుట్టకపోవడంతో భార్య చెల్లిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు జన్మించగా, ఆ తర్వాత మొదటి భార్యకు కూడా బిడ్డలు కలిగారు. వీరంతా కలసి ఒకేచోట ఉంటున్నారు.
అయితే, కామంతో రగిలిపోతున్న తండ్రి తనలోని వంకరబుద్ధిని బయటపెట్టాడు. రెండో భార్యకు జన్మించిన సంతానంలో 16 యేళ్ళ కుమార్తెపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయం నిందితుడి మొదటి భార్యకు తెలిసింది. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి ఆమె భర్తను మందలించాల్సిందిపోయి అతనికి సహకరించింది. పైగా గుట్టుచప్పుడుకాకుండా బాలికకు అబార్షన్ చేయించింది.
అయితే, బాధితురాలు ఇటీవల తాను పడుతున్న నరకయాతనను స్థానికంగా ఉండే ఓ మహిళకు చెప్పుకుని బోరున విలపించింది. దీంతో ఆ మహిళ బాలిక తల్లికి సమాచారం చేరవేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘోరం వెలుగుచూసింది. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు విచారణ చేపట్టి, ఈ అఘాయిత్యానికి పాల్పడిన తండ్రితో పాటు అతనికి సహకరించిన మొదటి భార్యను అదుపులోకి తీసుకున్నారు. తండ్రి చేసిన పాడుపనికి స్థానికులు సైతం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.