శుక్రవారం, 13 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 డిశెంబరు 2025 (11:44 IST)

నిరంతరాయంగా విద్యుత్ కోతలు... విసుగుచెంది కరెంట్ స్తంభమెక్కిన ఎమ్మెల్యే

electricity
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలు తారాస్థాయికి చేరాయి. నిత్యం కరెంట్ కోతలతో విసుగు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీకి చెందిన హరిద్వార్ ఎమ్మెల్యే విద్యుత్ స్తంభమెక్కి నిరసన తెలిపారు. ఆ తర్వాత విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు అధికారుల నివాసాలకు కరెంట్ సఫరా నిలిపివేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. 
 
తరచూ కరెంటు కోతలు అమలు చేయడంపై విసుగు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరేంద్ర తన మద్దతుదారులతో కలిసి నిరసన తెలిపారు. ఈ క్రమంలో బోట్‌ క్లబ్‌లోని సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ వివేక్‌ రాజ్‌పుత్‌ అధికార నివాసానికి కరెంటు సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత చీఫ్‌ ఇంజినీర్‌ అనుపమ్‌ సింగ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వినోద్‌ పాండేల ఇళ్లకు కూడా కరెంట్‌ కట్‌ చేశారు. 
 
ఈ సందర్భంగా వీరేంద్ర మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో రోజుకి 5-8 గంటలు కరెంట్‌ కోతలు ఉన్నాయన్నారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వ్యాపారులకు కూడా తీవ్ర నష్టం కలుగుతోందని వాపోయారు. ఈ సమస్యను 10 రోజులుగా విద్యుత్తు శాఖ వద్ద లేవనెత్తుతున్నామని, అయినా ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. 
 
మరోవైపు, ఎమ్మెల్యే చర్యలపై విద్యుత్‌ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందస్తు చర్యలు లేకుండా కరెంటు లైన్లను కత్తిరించారని.. ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని ఆరోపించారు. ఇది నిబంధనలు ఉల్లంఘించడమే కాక, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కిందకు వస్తుందని మండిపడ్డారు.