చిచ్చు రేపిన రీచార్జ్ ... సహజీవనం చేస్తున్న జంటలో ప్రియురాలు ఆత్మహత్య
గత కొంతకాలంగా ఎంతో అన్యోన్యంగా సహజీవనం చేస్తూ వచ్చిన ఓ జంట మధ్య మొబైల్ రీచార్జ్ చిచ్చురేపింది. ప్రియుడు తన మొబైల్‌కు రీచార్జ్ చేయించలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కుత్బుల్లాపూర్ ప్రశాంత్ నగర్‌లో కిరణ్మయి అనే యువతి నివాసం ఉంటోంది. గతంలో ఆమెకు వివాహమై విడాకులు తీసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆ బిడ్డ కిరణ్మయి తల్లివద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న ఆమెకు వెంకటేశ్ అలియాస్ చందూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో గత యేడాది కాలంగా వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం కిరణ్మయి ఫోన్ రీచార్జ్ గడువు ముగిసింది. జీతం ఇంకా రాకపోవడంతో తన ప్రియుడు వెంకటేశ్‌ను రీచార్జ్ చేయించమని కోరింది. అందుకు అతను నిరాకరించడంతో శుక్రవారం వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన కిరణ్మయి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రియుడు రీచార్జ్ చేయలేదన్న చిన్న విషయాన్ని నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
