సంబంధిత వార్తలు
వడ్డీ వ్యాపారుల వేధింపులు - పురుగుల మందు సేవించి దంపతుల ఆత్మహత్య
అప్పుల బాధ, వడ్డీ వ్యాపారుల వేధింపులను తాళలేక ఓ జంట పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం జరిగిది. స్థానిక పోలీసుల సమాచారం మేరకు...
మండలంలోని దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి అనే దంపతులు ఉండగా, వీరికి మూడేళ్ళ కుమార్తె హరిప్రియ ఉంది. బెజ్జంకి మండల కేంద్రంలో రెండేళ్ళఉగా దుస్తుల దుకారణం నిర్వహిస్తూ వారు ఉపాధి పొందుతూ అక్కడే అద్దె గదిలో నివాసముంటున్నారు.
అయితే, దుకాణం నిర్వహణతో పాటు కుటుంబ పోషణకు శ్రీహర్ష అప్పు చేశాడు. మరికొందరికి మధ్యవర్తిగా ఉంటూ ఇతరుల వద్ద అప్పులు ఇప్పించాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి కొద్ది రోజులుగా వేధింపులు ఎక్కువ కావడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున అద్దె గదిలో శ్రీహర్ష, రుక్మిణి దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
అపస్మారక స్థితిలో కింద పడిపోవడంతో తల్లిదండ్రులకు ఏమైందో తెలియని పరిస్థితిలో ఉన్న కుమార్తె హరిప్రియ కేకలు వేసింది. గది నుంచి నుంచి శబ్దాలు రావడంతో ఇంటి యజమాని గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇంటి ద్వారం పగలగొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే రుక్మిణి మృతిచెంది కనిపించింది.
కొన ఊపిరితో ఉన్న శ్రీహర్షతో పాటు పురుగుమందు తాగినట్లుగా ఉన్న హరిప్రియను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీహర్షను కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. హరిప్రియకు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
