శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 ఫిబ్రవరి 2026 (13:49 IST)

సర్పంచ్ పదవిపై ఆశ... కన్న కుమార్తెను మట్టుబెట్టిన తండ్రి

murder
సర్పంచ్ పదవిపై ఉన్న ఆశ ఓ కన్నతండ్రిని కసాయివాడిగా మార్చేసింది. ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హుడు అనే నిబంధనే అతన్ని కర్కోటకుడిగా మార్చేసింది. ఫలితంగా ముగ్గురు పిల్లలు ఉన్న ఓ కన్నతండ్రి.. ఓ చిన్నారని నీటిలోపడేసి హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ఠాణా పరిధిలో జరిగింది.
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఎడపల్లి మండలం ఏఆర్పీక్యాంపు శివారులో గత నెల 29న డి46 సాగునీటి కాల్వలో ఓ బాలిక మృతదేహం తేలియాడుతూ కనిపించింది. శరీరంపై గాయాలు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
బాలిక చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా కానిస్టేబుల్ సుధీర్ పోస్టును మహారాష్ట్రలోని ముఖేడ్ తాలూకా కెరూర్ గ్రామంలో ఉంటున్న అతని బంధువులు చూసి గుర్తుపట్టారు. పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేపట్టగా దిగ్భ్రాంతికర విషయాలు తెలిశాయి. 
 
కెరూర్కు చెందిన పాండురంగ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. గ్రామంలోనే క్షౌర వృత్తి చేస్తుంటాడు. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో సర్పంచిగా పోటీ చేయాలని ఆశపడ్డాడు. అయితే మహారాష్ట్రలో నిబంధనల ప్రకారం.. ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారని, ఒక బిడ్డను తనకు ఇచ్చేయాలని ప్రస్తుత గ్రామ సర్పంచి షిండే గణేశ్ పాండురంగకు సూచించాడు. 
 
దీంతో అతను తన కుమారుడి జనన ధ్రువీకరణపత్రంలో షిండేకు జన్మించినట్లుగా మార్పులు చేసి దత్తత ఇచ్చేయాలని ప్రయత్నించాడు. ఇందుకు పుణే కార్పొరేషన్ కార్యాలయానికి సైతం వెళ్లినా పని కాలేదు. దీంతో ఒక బిడ్డను చంపేసి తప్పిపోయినట్లుగా చెప్పి పోటీ చేయాలని భావించాడు. 
 
పథకం ప్రకారం తన పెద్దకుమార్తె ప్రాచీ(6)ని ద్విచక్రవాహనంపై కెరూర్ నుంచి సుమారు 60 కి.మీ. దూరంలోని ఏఆర్పీక్యాంపు శివారుకు తీసుకొచ్చాడు. ఆమె ప్రాథేయపడుతున్నా వినకుండా నిర్దాక్షిణ్యంగా 46 కాల్వలో పడేసి వెళ్లిపోయాడు. ఒకసారి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత వారు చనిపోయినా, తప్పిపోయినా ఎన్నికల్లో అనర్హులేనని పూర్తి నిబంధనలు తెలుసుకోకుండా అభంశుభం తెలియని కుమార్తెను కడతేర్చి, చివరకు జైలు పాలుయ్యాడు.