మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..
దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో ఓ దారుణం జరిగింది. ఓ మహిళా వ్యాపారవేత్తను మరో పారిశ్రామికవేత్త తుపాకీ చూపించి, చంపేస్తామని బెదిరించి నగ్నంగా చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడింది ఓ ఫార్మా ఎండీ కావడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ముంబైకు చెందిన 51 యేళ్ల మహిళా వ్యాపారవేత్తపై ఫ్రాంకో ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ వ్యవస్థాపక సభ్యుడు జాయ్ జాన్ పాస్కల్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలు ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనేక అంశాలు పేర్కొన్నారు.
ఓ సమావేశం పేరుతో తనను ఫార్మా కంపెనీ కార్యాలయానికి పిలిపించారు. అక్కడికి వెళ్లాక ప్రాణాలు తీస్తామని బెదిరించి దుస్తులన్నీ విప్పాలని బలవంతం చేశారు. అలా ఆమె నిస్సహాయ స్థితిలో ఉండగా నిందితుడు అసభ్య పదజాలంతో దూషిస్తూ తన ఫోటోలు, వీడియోలు చిత్రీకరించినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ వీడియోలను బహిర్గతం చేస్తానని తీవ్రంగా హెచ్చరించారని తెలిపారు.
ఈ దారుణ ఘటనపై బాధితారులు ధైర్యం చేసి ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జాయ్ జాన్ పాస్కల్‌తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై లైంగిక వేధింపులు, దాడి, క్రిమినల్ బెదిరింపుల కింద అభియోగాలు నమోదు చేసారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.