చేపల కూర సరిగా చేయలేదని భార్యను తిట్టిన భర్త... తర్వాత ఏం జరిగిందంటే...?
తమిళనాడు రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేపల కూర సరిగా చేయకపోవడంతో ఆగ్రహించిన భర్త... భార్యను దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు నాలుగు నెలల గర్భిణి కావడం గమనార్హం. ఈ ఘటన తమిళనాడు జిల్లాలోని నామక్కల్ జిల్లాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నామక్కల్ పరమతి వెల్లూరు సమీపంలోని ఓలపాలయం పంచాయతీలోని కళిమేడు ప్రాంతానికి చెందిన రైతు నవలాడి నాచియప్పన్ గత కొన్నేళ్ళ నుంచి పట్టు పురుగుల పెంపకం చేస్తున్నాడు. సెరికల్చర్ పనుల కోసం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన తిలక్ నాయక్, అతని భార్య మాధురి విశ్వకర్మ (20) గత ఆరు నెలలుగా అక్కడే పని చేస్తున్నారు.
అయితే, మంగళవారం మధ్యాహ్నం భోజనం చేస్తూ చేపల కూర ఎందుకు రుచిగా చేయలేదు అని అతని భార్యను తిట్టి పొలంలోకి వెళ్ళిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన మాధురి తన దుప్పట్టాతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చిన తిలక్ నాయక్.. తన భార్య సీలింగ్ ఫ్యానుకు వేలాడుతున్న దృశ్యాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
