పెళ్లయి 3 నెలలే, గడ్డి మందు తాగి టెక్కీ సూసైడ్, కారణం ఏంటి?
పెళ్లయిన 3 నెలలకే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వివాహిత గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మందమర్రి పట్టణానికి చెందిన శ్రావణి హైదరాబాదులో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. ఈమెకి 3 నెలల క్రితం మంచిర్యాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రంజిత్ అనే వ్యక్తితో పెళ్లయ్యింది.
రంజిత్ తన ఉద్యోగాన్ని హైదరాబాదుకి మార్చుకుని ఇద్దరూ ఒకేచోట వుండేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు శ్రావణి హైదరాబాదులోని ఓ హాస్టల్లో వుంటూ ఉద్యోగం చేస్తోంది. మంగళవారం రాత్రి యధావిధిగా పనులు ముగించుకుని తన గదికి వచ్చింది. రాత్రయ్యాక తన భర్త రంజిత్ కి ఫోన్ చేసి తను గడ్డి మందు తాగానని చెప్పింది.
దీనితో షాక్ తిన్న భర్త హుటాహుటిన వచ్చి ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చాడు. ఐతే పరిస్థితి విషమించి బుధవారం ఉదయం ఆమె కన్నుమూసింది. పెళ్లయిన 3 నెలలకే ఇలా దారుణం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా శ్రావణి బలవన్మరణానికి పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.