గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2026 (12:21 IST)

హనీ ట్రాప్ కేసు : నకిలీ ట్రేడింగ్ యాప్‌లో రూ.2.14 కోట్లు పోగొట్టుకున్న టెక్కీ

cyber crime
హానీ ట్రాప్ మాయలో పడిన ఓ సాఫ్ట్‌‍వేర్ ఇంజనీర్ ఏకంగా రూ.2.14 కోట్లు పోగొట్టుకున్నాడు. సోషల్ మీడియా వేదికలో పరిచయమైన ఓ మహిళ.. మాయమాటలు చెప్పి, నకిలీ ట్రేడింగ్‌‍ యాప్‌లో పెట్టుబడి రూపంలో ఈ మొత్తాన్ని కాజేసింది. ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, టీఎన్ జీవో కాలనీకి చెందిన 44 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి గతేడాది డిసెంబరులో సోషల్ మీడియా ద్వారా ఓ మహిళ పరిచయమైంది. తాను స్టాక్ ట్రేడింగ్‌లో భారీగా లాభాలు గడిస్తున్నట్లు నమ్మించింది. 
 
ఆమె మాటలు విశ్వసించిన బాధితుడి చేత ఓ నకిలీ ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించింది. ఇందులో గత యేడాది డిసెంబరు 12వ తేదీన తొలిసారి రూ.31.5 లక్షలు పెట్టుబడి పెట్టగా, యాప్‌లో భారీగా లాభాలు కనిపించాయి. దీంతో మరింత పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయని ఆ మహిళ ఆశ చూపింది. ఆమెను నమ్మి రెండోసారి రూ.42.27 లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత లాభాలను విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, వచ్చిన లాభంలో 30 శాతం పన్ను యూఏఈ ప్రభుత్వానికి కట్టాలని మోసగాళ్లు మెలిక పెట్టారు.
 
యాప్‌లో కనిపిస్తున్న వర్చువల్ లాభాలను నిజమని నమ్మిన బాధితుడు, ఆఫీసు సహోద్యోగుల నుంచి రూ.90 లక్షలు అప్పు తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల నుంచి డబ్బు సేకరించి, కొన్ని ఆస్తులను కూడా అమ్మి మొత్తం 8 విడతల్లో రూ.2.14 కోట్లు వారికి పంపాడు. చివరకు డబ్బు విత్ డ్రా కోసం ప్రయత్నించగా, అదనంగా మరో రూ.68 లక్షలు కట్టాలని చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు.
 
వెంటనే అప్రమత్తమైన బాధితుడు, ఆ మహిళ ఫొటోను ఇంటర్నెట్‌లో వెతకగా, అది ఇన్‌స్టాగ్రామ్‌లోని వేరొకరి ప్రొఫైల్ నుంచి దొంగిలించిందని తేలింది. దీంతో తాను నకిలీ ప్రొఫైల్‌తో మోసపోయానని నిర్ధారించుకుని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.