సోమవారం, 16 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 డిశెంబరు 2025 (10:27 IST)

ప్రేమ, అక్రమ సంబంధం.. ఆపై బ్లాక్‌మెయిల్.. యువకుడిని చంపేసిన అక్కా చెల్లెళ్లు

murder
ప్రేమ, అక్రమ సంబంధం, ఆపై అసభ్యకర వీడియోలతో బ్లాక్‌మెయిల్, బెదిరింపులకు పాల్పడుతూ వచ్చిన ఓ యువకుడిని అక్కా చెల్లెళ్లు హత్య చేశారు. పథకం ప్రకారం ఇంటికి పిలిపించి కళ్లలో కారం కొట్టి కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్ (32) హైదరాబాద్ నగరంలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసేవాడు. అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే ఒక యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఆమె అక్కతో కూడా మహేందర్ సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల ఆ యువతికి పెళ్లి సంబంధం రావడంతో మహేందర్ అసూయతో రగిలిపోయాడు. తన దగ్గర ఉన్న ఆమె అసభ్యకర వీడియోలను కాబోయే పెళ్లికొడుకు తరఫు వారికి చూపి ఆ సంబంధాన్ని చెడగొట్టాడు.
 
అప్పటి నుంచి తన వద్ద ఉన్న వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. దీంతో మహేందర్‌ను వదిలించుకోవాలని అక్కాచెల్లెళ్లు నిర్ణయించుకున్నారు. పక్కా ప్లానుతో శుక్రవారం రాత్రి అతడికి ఫోన్ చేసి పిలిపించారు. రాత్రి 10 గంటల సమయంలో వారి మధ్య మాటమాట పెరగడంతో ముందే సిద్ధం చేసుకున్న కారంపొడిని మహేందర్ కళ్లలో చల్లారు. అతడు తేరుకునేలోపే కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిందితుల బంధువులు కూడా పాలుపంచుకున్నారు. 
 
తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న మహేందరు గమనించిన స్థానికులు 108 వాహనంలో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అతడు శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.